
నెలలు గడుస్తున్నా మహేష్ బాబు, మురుగదాస్ ల చిత్రం గురించి ఒక క్లారిటీ మాత్రం ఇంకా రావట్లేదు. షూటింగ్ ఎనభై శాతం పూర్తయిందని ఏనాడో వార్తలొచ్చినా... ఇంకా సినిమా షూటింగులు కొనసాగుతునే ఉన్నాయి. వియత్నాం నుంచి ఇండియాకి తిరిగొచ్చిన మహేష్‌బాబు ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా తిరిగి చెన్నైలో షూటింగ్ చేస్తున్నాడు. ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌లో మహేష్ సీక్రెట్ ఏజెంట్‌గా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ మూవీకి స్పైడర్ అనే టైటిల్ పరిశీలనలో వుందని ప్రచారంలో వుంది.
ఇక జూన్ 23న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇంకా షూటింగ్ జరుపుకోవడం ఆశ్చర్యపరుస్తోంది. అప్పుడెప్పుడో 80 శాతం షూటింగ్ పూర్తయిందన్న ఈ చిత్రానికి ఒక్క రోజు కూడా విరామం లేకుండా ఇప్పుడెందుకు అదే పనిగా షూటింగ్ చేస్తున్నారో అర్థంకాదు. ఇండస్ట్రీలో వినిపిస్తోన్న పుకార్లని బట్టి ఆల్రెడీ తీసేసిన కొన్ని పోర్షన్లు సరిగా రాలేదనే ఫీలింగ్‌తో మరోసారి వాటిని చిత్రీకరిస్తున్నారట.
దీనివల్ల వర్క్ లోడ్ పెరిగిందని, ఎట్టి పరిస్థితుల్లోను జూన్ 23న విడుదల చేసి తీరాలని ఫిక్స్ అవడం వల్ల విదేశాలు తిరిగి వచ్చినప్పటికీ గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రం తుపాకీ, కత్తి తరహాలో కమర్షియల్, సోషల్ మెసేజ్ మిక్స్‌డ్‌గా వుంటుందని, యాక్షన్ ఎపిసోడ్స్ అయితే హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కాయని చెబుతున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేసి టైటిల్‌పై ఏర్పడ్డ సస్పెన్స్‌కి తెర దించబోతున్నారని సమాచారం.