
సామాజిక అంశాలపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పే కమల్ త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన దగ్గరినుంచీ పలు అంశాలపై స్పందిస్తున్నారు. కమల్ వ్యాఖ్యలను తమిళనాడు ప్రజల నుంచే కాక దేశవ్యాప్తంగా కూడా మంచి స్పందన వస్తోంది. అయితే తన వ్యాఖ్యల వల్లే కమల్ ఇప్పుడు చిన్న చిక్కులో ఇరుక్కున్నాడు.
కమల్ వ్యాఖ్యలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఏకంగా మద్రాస్ హైకోర్టు చెన్నై పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాజకీయాల్లోకి దిగిపోయానంటూ ఇప్పటికే ప్రకటించిన కమల్ ను టార్గెట్ చేసి కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.
కమల్ దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోందని కమల్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించిన మద్రాస్ హైకోర్టు కమల్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. హిందూ ఉగ్రవాదం నానాటికీ పెచ్చరిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు కత్తులతో పొడుస్తున్నట్టు ఈ వ్యాఖ్యలపై వెనువెంటనే కొన్ని వర్గాల నుంచి రియాక్షన్ వినిపించినా... కమల్ దానిని పెద్దగా పట్టించుకోలేదు.
అయితే హిందూ ఉగ్రవాదం అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఓ వ్యక్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యాఖ్యల ద్వారా హిందువులపై ఉగ్రవాదులు అనే ముద్రను కమల్ వేశారంటూ పిటిషనర్ కోర్టుకు విన్నవించాడు. హిందువులకు వ్యతిరేకంగా విషాన్ని వ్యాపింపజేసేందుకు కమల్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
ఇవాళ హిందువులను ఉగ్రవాదులు అన్నారని... రేపు, ముస్లింలను, క్రిస్టియన్లను ఉగ్రవాదులు అంటారని తెలిపారు. పిటిషనర్ వాదనతో ఆలోచనలో పడ్డ కోర్టు... కమల్ వ్యాఖ్యల్లో విచారించదగిన అంశాలున్నాయని, ఆయనపై కేసు నమోదు చేయాలని చైన్నై నగర పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. మరి ఈ కేసు విచారణ ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి. మొత్తానికి కమల్ ని ఇప్పటినుంచే ఇబ్బందులకు గురి చేసి పార్టీ పెట్టకముందే అతన్ని మానసికంగా బలహీనున్ని చేయాలని ప్రభుత్వం ఇలా చేస్తోందని తమిళనాట చర్చ జరుగుతోంది.