
చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం కొరకు చిరంజీవి(Chiranjeevi) అధ్యక్షతన ప్రముఖులు ఫిబ్రవరి 10న ఏపీ సీఎం జగన్ ని కలిశారు. మహేష్ (Mahesh), ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, ఆర్ నారాయణమూర్తి, ఆలీ వంటి ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎంతో భేటీ అనంతరం చర్చలు ఆశాజనకంగా ముగిశాయని, టికెట్స్ ధరలతో పాటు పలు పరిశ్రమ సమస్యలకు పరిష్కారం దొరికినట్లే అని చిరంజీవితో పాటు మిగతా ప్రముఖులు మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు.
అయితే ఈ భేటీ చిత్ర పరిశ్రమలోని మరొక వర్గం నొచ్చుకునేలా చేసింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అద్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు, అత్యంత సీనియర్ నటుడు అయిన మోహన్ బాబుకు ఆహ్వానం లేకపోవడం వారిని ఒకింత నిరాశకు గురిచేసింది. చిత్ర పరిశ్రమ నుండి చిరంజీవికి సీఎం జగన్ ప్రత్యేక గౌరవం ఇచ్చినట్లు అయ్యింది. పరిశ్రమకు పెద్ద ఎవరనే చర్చ కొన్నాళ్లుగా కొనసాగుతుండగా.. సీఎంతో భేటీ నేపథ్యంలో చిరంజీవినే అని నిర్ధారించినట్లు అయ్యింది.
ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీ కూడా చిరంజీవి కంటే మేము ఏం తక్కువ కాదు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని తమ ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చారు. ఇది కొంచెం వివాదాస్పదమైంది. మిత్రుడైన పేర్ని నాని తన ఇంటికి రావడం కూడా రాజకీయం చేస్తారా అంటూ మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ పరిణామాల అనంతరం మంచు విష్ణు సీఎం జగన్ (Cm Jagan)తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న అధికారిక భేటీనా? లేక పూర్తిగా వ్యక్తిగత భేటీనా? అనేది తెలియాల్సి ఉంది. మంచు విష్ణు మీడియాతో మాట్లాడితే కానీ ఈ విషయంపై క్లారిటీ రాదు. మంచు విష్ణు ఆయన భార్య తరపు నుండి సీఎం జగన్ కి బంధువులు కూడాను. ఇక ఇంత బిజీ షెడ్యూల్ లో మంచు విష్ణుకు సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం కేసుల చెప్పుకోదగ్గ విషయం.