నామినేషన్స్ దాఖలు చేసిన ప్రకాష్ రాజ్ ప్యానెల్... పవన్ వ్యాఖ్యలపై స్పందించనన్న ప్రకాష్ రాజ్!

By team teluguFirst Published Sep 27, 2021, 12:06 PM IST
Highlights

'మా' అధ్యక్ష అభ్యర్థిగా ప్రకాశ్‌ రాజ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ నామినేషన్ వేయడం జరిగింది.

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలకు సంబంధించిన నామినేషన్‌ల ప్రక్రియ నేటి నుండి మొదలైంది. 'మా' అధ్యక్ష అభ్యర్థిగా ప్రకాశ్‌ రాజ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ నామినేషన్ వేయడం జరిగింది. వీరితో పాటు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ సభ్యులు కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. 'మా' కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ నామినేషన్ పత్రాలను అందజేశారు. 


ఇప్పటికే ప్రకాష్ రాజ్ 27మంది సభ్యులతో కూడిన తన ప్యానల్‌ సభ్యులను ప్రకటించిన సంగతి తెలిసిందే. జయసుధ, శ్రీకాంత్, సాయి కుమార్, బెనర్జీ, ఉత్తేజ్, అనసూయ, సుడిగాలి సుధీర్ ఈ ప్యానెల్ లో ఉన్న సభ్యులలో కొందరు.


ఇక నామినేషన్స్ అనంతరం ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు. నేటి నుండి నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ప్రతి విషయంలో మేము ముందు ఉన్నాము.  మా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగుతున్నట్లు వెల్లడించారు. ఇవి మా ఎలక్షన్స్ మాత్రమే, ఇక్కడ రాజకీయ పార్టీల జోక్యం ఉండదు అన్నారు. మంచు విష్ణు చెప్పిన ఈ విషయాన్ని నేను సమర్దిస్తున్నాను అన్నారు ప్రకాష్ రాజ్. 


ఇక పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ పవన్ ఒక రాజకీయ నాయకుడు, అతని సిద్ధాంతాలు, నమ్మకాలు ఆయనకు ఉన్నాయి. పవన్ స్పీచ్ లో ఆవేశం మాత్రమేనా, నిజం కూడా ఉందా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆవేశం ఉంటుంది, నిజం ఉంటుంది. ఎవరి సిద్ధాంతాలు వారివి అంటూ... అస్పష్టంగా సమాధానం చెప్పారు. అసోసియేషన్ వరకు ఆయనను ఓ మెంబర్ గా చూస్తాము అన్నారు. ప్రస్తుతం మా ఎలక్షన్స్ గురించి మాట్లాడతాను, పొలిటికల్ కామెంట్స్ చేయను అన్నారు. 
 

కాగా ఈరోజు మధ్యాహ్నమే సీవీఎల్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అలాగే మరో అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు సెప్టెంబర్ 28న నామినేషన్స్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.

click me!