
సూపర్ స్టార్ రజనీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. దాదాపు 46ఏళ్ల తర్వాత ఈ కాంబోలో సినిమా రాబోతుంది. ఈ విషయాన్ని కమల్ హాసన్ కూడా వెల్లడించారు. ఆ మధ్య సైమా వేడుకలో దీనిపై ఆయన స్పందిస్తూ, ప్రేక్షకులు మా కాంబినేషన్‌ని ఇష్టపడితే మంచిదే కదా, వారు సంతోషంగా ఉంటే మాకూ ఆనందమే, మేమిద్దరం కలిసి నటించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. కానీ కుదరలేదు. త్వరలోనే మీ ముందుకు కలిసి రానున్నాం. అది మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తుంది` అని వెల్లడించారు కమల్. ఇలా రజనీతో సినిమా చేయబోతున్నామనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్‌లో మూవీకి దర్శకుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రారంభంలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని అన్నారు. ఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్ పేరు వినిపించింది. కానీ తాను డైరెక్ట్ చేయడం లేదని ప్రదీప్ రంగనాథన్ తెలిపారు. దీంతో మళ్లీ లోకేష్ దగ్గరే వార్తలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. రజనీ, కమల్ మూవీకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడం లేదట. ఇటీవలే రజనీకి లోకేష్ ఒక మాస్, యాక్షన్ స్క్రిప్ట్ ని నెరేట్ చేశారు. ఇందులో వాయిలెన్స్ శృతి మించి ఉందట. స్క్రిప్ట్ విషయంలో రజనీ సంతృప్తి చెందలేదట. దీంతో లోకేష్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చినట్టు కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్.. రజనీ, కమల్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే రజనీకాంత్‌కి నెల్సన్ ఓ స్క్రిప్ట్ ని నెరేట్ చేశారు. దీనికి సూపర్ స్టార్ బాగా ఇంప్రెస్ అయ్యారట. సినిమా చేసేందుకు సుముఖతని వ్యక్తం చేసినట్టు సమాచారం. లోకేష్ స్క్రిప్ట్ కంటే నెల్సన్ చెప్పిన స్క్రిప్ట్ ని రజనీ ఎక్కువగా లైక్ చేశారట. దీంతో ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇదే ఇప్పుడు కోలీవుడ్ లో వైరల్‌గా మారింది. రజనీకాంత్, కమల్ హాసన్ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్‌గా ఫిక్స్ అనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పటికే రజనీకాంత్‌తో `జైలర్` మూవీని రూపొందించారు. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కోలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. రజనీకాంత్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది. ఇందులో మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ హైలైట్‌గా నిలిచాయి. సినిమాని బ్లాక్ బస్టర్ చేశాయి. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా `జైలర్ 2` రూపొందుతుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో నెల్సన్ వర్క్ కి రజనీ బాగా ఇంప్రెస్ అయ్యారట. అందుకే మరోసారి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయంపై కూడా మరింత స్పష్టత రావాల్సి ఉంది. కాకపోతే కోలీవుడ్ మీడియా మాత్రం దీన్ని బాగా వైరల్ చేస్తోంది.
రజనీకాంత్ చివరగా లోకేష్ కగనరాజ్ దర్శకత్వంలో `కూలీ` మూవీ చేశారు. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్, శృతి హాసన్, సౌబిన్ షాహిర్ వంటి భారీ తారాగణంతో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్ 14న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద సుమారు రూ.500కోట్లు రాబట్టినా ఫ్లాప్ జాబితాలో చేరిపోయింది. దీంతో లోకేష్ తో సినిమా విషయంలో రజనీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. మరోవైపు కమల్ హాసన్ చివరగా `థగ్ లైఫ్`తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రం పరాజయం చెందింది. అంతకు ముందు `ఇండియన్ 2` తోనూ డిజాస్టర్ అందుకున్నారు. దీంతో కొత్త సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్బరివ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు కమల్.