Lata Mangeshkar: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కి కరోనా.. ఐసీయూలో చికిత్స!

By Sambi ReddyFirst Published Jan 11, 2022, 12:38 PM IST
Highlights

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (Lata Mangeshkar) కరోనా బారినపడ్డారు. ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కోవిడ్ (Corona Virus)మహమ్మారి మరలా నిద్ర లేచింది. రోజుల వ్యవధిలో తీవ్రరూపం దాల్చింది. దేశంలోని వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కి కరోనా సోకినట్లు సమాచారం అందుతుంది. 92 ఏళ్ల లతా మంగేష్కర్ గారికి కరోనా సోకిందన్న విషయం ఆందోళన కలిగిస్తుంది. ఆమెను ముంబైలోని ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ బ్రీచ్ కాండీ నందు అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఐసీయూ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

లతా మంగేష్కర్ వయసు రీత్యా ఎక్స్పర్ట్స్ వైద్య బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుత లతా హెల్త్ కండీషన్ పై స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది. మరోవైపు లతా మంగేష్కర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 

13ఏళ్లకే సింగర్ గా ప్రస్థానం మొదలుపెట్టిన లతా మంగేష్కర్ దశాబ్దాల పాటు సినిమా పాటను ఏలారు. భాషా భేదాలు లేకుండా కెరీర్ లో 25000  పైగా పాటలు పాడారు. సింగర్ గా లతా అందుకున్న అవార్డులు, సాధించిన విజయాలు మరెవరికీ సాధ్యం కావు. 2001లో దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' అవార్డు ఆమెను వరించింది. అలాగే 2007లో ఫ్రాన్స్ దేశం తమ అత్యున్నత గౌరవ పురస్కారం 'లీజన్ ఆఫ్ హానర్' తో లతాను గౌరవించింది. పద్మభూషణ్, దాదా సాహెబ్ పాల్కే వంటి ఉన్నతమైన అవార్డ్స్ లతా మంగేష్కర్ సేవలకు భారత ప్రభుత్వం అందించింది.

కాగా రోజుల వ్యవధిలో అనేక మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఒక్క టాలీవుడ్ లోనే మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్, త్రిష, బండ్ల గణేష్, థమన్ లతో పాటు పలువురికి కరోనా సోకింది. రోజుకు వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో థర్డ్ వేవ్ భయాలు మొదలయ్యాయి. రెండేళ్లుగా కరోనా లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాక్షికంగా కరోనా ఆంక్షలు విధించాయి. 

అలాగే మాస్క్ ధరించడం తో పాటు భద్రతా నియమాలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కారణం... వాక్సిన్ తీసుకున్నవారికి కూడా కరోనా సోకుతుంది. 

click me!