Tollywood-AP ticket prices:సినిమా రాజకీయం... టాలీవుడ్ ఏ పార్టీది?

Published : Jan 11, 2022, 12:14 PM ISTUpdated : Jan 11, 2022, 12:15 PM IST
Tollywood-AP ticket prices:సినిమా రాజకీయం... టాలీవుడ్ ఏ పార్టీది?

సారాంశం

పరిశ్రమకు చెందిన నటులు, దర్శక నిర్మాతలు కూడా ఏదో ఒక పార్టీ అంటే అభిమానం, ప్రేమ కలిగి ఉంటారు. ఈ అభిమానం ఎలా ఏర్పడిందనేది అనేక సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా కులం, సన్నిహిత సంబంధాలు. ఆ తర్వాత సదరు పార్టీ, ప్రభుత్వం వలన దక్కిన ప్రయోజనాలు.

రాజకీయాలతో సినిమాకు విడదీయరాని బంధం ఉంది. స్టార్స్ గా అశేష అభిమాన గణాన్ని సంపాదించుకొని రాజ్యాలు ఏలారు కొందరు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి స్టార్స్ ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక లెక్కలేనంత మంది సినిమా వాళ్ళు ఎంపీలుగా , ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పదవులు చేపట్టారు. సినిమా-రాజకీయం జనాలను విపరీతంగా ప్రభావితం చేయగల రెండు రంగాలు. ఇవి ఒకదానిపై మరొకటి ఆదారపడి ఉంటాయి. 

ఇక పరిశ్రమకు చెందిన నటులు, దర్శక నిర్మాతలు కూడా ఏదో ఒక పార్టీ అంటే అభిమానం, ప్రేమ కలిగి ఉంటారు. ఈ అభిమానం ఎలా ఏర్పడిందనేది అనేక సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా కులం, సన్నిహిత సంబంధాలు. ఆ తర్వాత సదరు పార్టీ, ప్రభుత్వం వలన దక్కిన ప్రయోజనాలు. కాబట్టి సహజంగా ఎప్పుడూ సదరు పరిశ్రమ ప్రముఖులకు ప్రయోజనాలు చేకూర్చే, పనులు చేసి పెట్టే ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకుంటారు. అలాగే సీఎం గా ఆయన ఉంటే బాగుంటుందని ఆశపడతారు. 

అయితే ఏ ఒక్క స్టార్ హీరో, నిర్మాత, డైరెక్టర్ లేదా సీనియర్ నటుడు ఓపెన్ గా పలానా పార్టీకే నా మద్దతని చెప్పరు. అభిమానించే పార్టీ అధికారంలో ఉంటే కొంచెం యాక్టీవ్ గా ఉంటారు. మంత్రులను, ముఖ్యమంత్రులను కలుస్తూ మంచి చెడూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కాకుండా తమ ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వస్తే ముడుచుకుపోతారు. అయితే ఎమోషనల్ గా ఏమాత్రం బయటపడరు. ప్రభుత్వంతో విరోధం పెట్టుకోవడం మంచిది కాదు కాబట్టి కలిసి ఉన్నట్లు కలరింగ్ ఇస్తారు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ మాట్లాడకుండా గమ్మునుండి పోతారు. 

సినిమా వాళ్లకు ప్రభుత్వాలు చేసే ప్రయోజనాలు ఏమిటని లోతుల్లోకి వెళితే పెద్ద కథే ఉంది. అదంతా వదిలేస్తే ముఖ్యంగా స్టార్ హీరోలకు, నిర్మాతలకు, దర్శకులకు కావలసింది టికెట్స్ ధరలు. బెనిఫిట్ షోలు. ఈ రెండింటిపై ఎటువంటి ఆంక్షలు విధించకూడదనేది వాళ్ళ కోరిక. అనాదిగా అధికారం చెలాయించిన ప్రభుత్వాలు అసలు సినిమా వాళ్ళ జోలికి పోలేదు. పై పెచ్చు వాళ్ళ కోరికల పట్ల సానుకూలంగా ఉండేవి.   థియేటర్స్ కి లైసెన్సులు సంగతి తర్వాత... అసలు శుభ్రమైన టాయిలెట్స్ ఉన్నాయా? అని కూడా పట్టించుకోలేదు. వంద రూపాయల టికెట్ రూ. 500 అమ్మితే దాన్ని జనాలు కూడా సమస్యగా చూడక పోవడం విడ్డూరం. పైగా తమ అభిమాన హీరో ఫస్ట్ డే టికెట్స్ వెయ్యి పలికిందట, పదివేలు పలికిందట అని గొప్పగా చెప్పుకుంటారు. అది ఒక రికార్డుగా భావిస్తారు.  సినిమా ధరలు తగ్గించాలని ప్రేక్షకులు ఎప్పుడూ రోడ్డున పడలేదు. 

ఎందుకంటే ఇష్టమైతే సినిమా చూడు లేదంటే మానుకోమన్న సూత్రం అమలవుతుంది. ఎవ్వరూ గెలకని విషయంలో ఏలు పెడితే నిజంగా దాని తాలూకు స్మెల్ దారుణంగా ఉంటుంది. ఏపీ టికెట్స్ ధరల విషయంలో జరుగుతున్న రాద్ధాంతం దీనికి చక్కని ఉదాహరణ. సీఎం జగన్ సినిమా వాళ్లపై పడ్డాడు. కొందరు హీరోలను టార్గెట్ చేశాడు. అసలు ప్రభుత్వానికి సంబంధం లేని విషయంలో తలదూర్చాడు అంటుంది ఒక వర్గం. మరో వర్గం దీని ఖండిస్తోంది. 

టికెట్స్ ధరల డిబేట్ వేదికగా పరిశ్రమ రాజకీయ పార్టీలుగా విడిపోయింది. టీడీపీ, జేఎస్పీ ఒకవైపు.. వైసీపీ ఒకవైపు అన్నమాట. టికెట్స్ ధరల తగ్గింపును సమర్థిస్తూ మాట్లాడుతున్న వారంతా వైసీపీ అని వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారంతా టీడీపీ-జనసేనకు చెందిన వారు అంటున్నారు. ప్రత్యేకంగా పరిశ్రమకు కోసం పోరాడే వారు అంటూ ఎవరూ లేరు. టీవీ డిబేట్లు గమనించినా ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. పరిశ్రమలో పార్టీల కుమ్ములాటలు ఎప్పటి నుండో వున్నాయి. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించాక ఆయన సామాజిక వర్గానికి చెందిన నటులతో పాటు మెజార్టీ వర్గం ఆ పార్టీ పంచన చేరారు. 

ఎన్టీఆర్ (NTR)తో మనస్పర్థలు, వివాదాల కారణంగా కృష్ణ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఏఎన్నార్ సైతం టీడీపీ పార్టీకి దూరంగా ఉండడం జరిగింది. అయితే అప్పట్లో ఇవన్నీ ప్రజల దాకా చేరేవి కావు. ఈ మధ్య సినిమా వేడుకలు రాజకీయ విమర్శలకు వేదిక కావడంతో పాటు సోషల్ మీడియా ద్వారా ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యతిరేకంగా కామెంట్స్ చేయడంతో సామాన్య ప్రజలకు కూడా ఒక అవగాహన వచ్చింది. పరిశ్రమ పెద్దల్లో ఎవరు ఏ పార్టీకి చెందినవారో స్పష్టత వచ్చిందని కొందరు అంటున్నారు. 

ఇక ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ (Mahesh babu), అల్లు అర్జున్ (Allu Arjun) వంటి స్టార్స్ ఈ టికెట్స్ ధరలపై మాట్లాడక పోవడానికి కారణం కూడా అదే. సినిమా టికెట్స్ ధరల తగ్గింపు వ్యతిరేకిస్తే ఒక పార్టీకి సప్పోర్ట్ చేస్తే మరొక పార్టీకి వాళ్ళను అంటగట్టేస్తారు. తమ అభిమానుల్లో అన్నీ పార్టీల వాళ్ళు ఉంటారు కాబట్టి.. వాళ్ళు సదరు హీరో పట్ల నెగిటివ్ ఫీలింగ్ పెంచుకునే అవకాశం కలదు. కాబట్టి సమస్యకు ఒక పరిష్కారం వచ్చే వరకు వేచి చూద్దాం.. కాదు అనుకున్నప్పుడు రహస్య రాయబారాలు సాగిద్దాం అని వేచి చూస్తూ ఉండవచ్చు. మొత్తంగా ఏపీ టికెట్స్ ధరలు వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంటూ... పార్టీల వారీగా విడిపోయి విమర్శించుకునే స్థాయికి చేరింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్
Radha Daughter: చిరంజీవి హీరోయిన్ కూతురు, గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి