
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'RRR' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు.
అయితే ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ ఖరారు కాలేదు. మొదటి నుండి 'RRR' అనే వర్కింగ్ టైటిల్ ని కంటిన్యూ చేస్తున్నారు. అయితే దీనికి సరిపడే ఎబ్రివేషన్ పంపించాల్సిందిగా దర్శకుడు రాజమౌళి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో వివిధ భాషలకు చెందిన అభిమానులు తము అనుకున్న టైటిల్స్ ని ప్రమ్పిస్తున్నారు. 'రఘుపతి రాఘవ రాజారాం', 'రాజ్యం రణం రక్తం', 'రాముడు రుద్రుడు రణరంగం' ఇలా చాలా మంది పంపించిన టైటిల్స్ ని 'RRR' యూనిట్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
అన్ని భాషల నుండి 'RRR'కు సంబంధించిన ఎబ్రివేషన్స్ వెల్లువలా వస్తున్నాయని అందులో కొన్ని పవర్ ఫుల్ గా, కొన్ని భావయుక్తంగా, మరికొన్ని ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని అన్నారు. ఇంకా టైటిల్స్ పంపాలని, ఎవరికి తెలుసు.. మీరు పంపించేదే 'RRR' అసలు టైటిల్ అవుతుందేమో అంటూ పోస్ట్ పెట్టారు.