
`కౌన్ బనేగా కరోడ్‌పతి`(కేబీసీ).. తెలుగులో `మీలో ఎవరు కోటీశ్వరుడు`.. హిందీలో బాగా పాపులర్ అయిన రియాలిటీ షో. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా రన్ అయ్యే ఈ షో బాగా ఆదరణ పొందుతుంది. అయితే ప్రస్తుతం 12వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ చాలా ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో ఇద్దరు కోటీ రూపాయలు గెలుచుకున్నారు.
ఈ సీజన్‌లో ఫస్ట్ టైమ్ నజియా నసీమ్ అనే మహిళా కోటి రూపాయలు గెలుచుకుని రికార్డు సృష్టించగా, తాజాగా మరో మహిళా కోటి రూపాయలు గెలుచుకోవడం ఓ విశేషమైతే, ఆమె ఐపీఎస్ అధికారిణి కావడం మరో విశేషం. మెహితా శర్మ అనే ఐపీఎస్ ఆఫీసర్ ఈ సీజన్‌లో కోటి రూపాయలు గెలుచుకున్న రెండో కంటెస్టెంట్‌గా నిలిచారు. ఈ విషయాన్ని సోని ఎంటర్‌టైన్‌మెంట్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఇప్పుడు ఆమె ఏడు కోట్ల ప్రశ్నకు చేరుకోగలిగారు. మరి ఈ ఏడు కోట్ల ప్రశ్న ఏంటి? దానికి ఆమె ఏం సమాధానం చెప్పింది? రైటా? రాంగా? అన్నది తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే. నవంబర్ 17న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ సీజన్‌లో తాజా ఎపిసోడ్‌లో నటి రత్నా ప్రతాక్ షా, స్వయం డైరెక్టర్, వ్యవస్థాపకురాలు కరమ్ వీర్ అనురాధ కపూర్‌లు ఇద్దరు కలిసి రూ. 25లక్షలు గెలుచుకున్నారు. అలాగే రూబి సింగ్ అనే మరో కంటెస్టెంట్ కూడా ఈ ఎపిసోడ్‌లోనే రూ. 25లక్షలు గెలుచుకోవడం విశేషం. ఇక ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఏడుకోట్ల ప్రశ్నకి సమాధానం చెబుతుందా? వైదొలుగుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.