
`ఓటీటీ`లు వచ్చాక సినిమా నిర్మాతలకు ధైర్యం వచ్చింది. థియేటర్లలో ఆడియెన్స్ సినిమాలు చూసి హిట్ చేస్తారని ఇప్పుడు నిర్మించడం లేదు. ఓటీటీలు ఉన్నాయనే ధైర్యంతో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు రానుండటం, వాటిని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తెరకెక్కుతుండటం విశేషం. అంతగా సినిమాలను శాషిస్తున్నాయి ఓటీటీలు. ఇంకా చెప్పాలంటే ఓటీటీపై చిత్ర పరిశ్రమ ఆధారపడి ఉందని చెప్పొచ్చు.
అయితే ఇప్పుడు థియేటర్లలోకి ఆడియెన్స్ వచ్చే శాతం చాలా తగ్గిపోయింది. భారీ సినిమాలకు, బాగుందనే టాక్ వచ్చిన సినిమాలనే చూసేందుకు ఇష్టపడుతున్నారు. అది కూడా కొంత మేరకే. ఎలాగూ నెల తిరిగే లోపు ఓటీటీలో వస్తుంది కాదా అక్కడ చూసుకుందామనేది వారి ఫీలింగ్. ఈ నేపథ్యంలో ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. అదే సమయంలో సినిమాలకు డిమాండ్ పెరిగింది. పెద్ద సినిమాలను భారీ రేట్‌కి కొనుగోలు చేస్తున్నాయి ఓటీటీలు. ఓటీటీలు కూడా పెరిగిపోవడంతో వాటిలోనూ పోటీ పెరిగింది. ఇది సినిమాలకు కలిసొచ్చే అంశం.
తాజాగా విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న `ఖుషి` సినిమాకి సంబంధించిన ఓటీటీ డీల్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ డీల్ ఫైనల్ అయ్యిందట. భారీ రేటుకి అమ్ముడుపోయిందని తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులు తీసుకుందని, ఏకంగా రూ.30కోట్లకు దక్కించుకుందని సమాచారం. అయితే ఈ సినిమా పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతుంది. దీంతో అన్ని భాషలకుగానూ ఈ మొత్తానికి సొంతం చేసుకుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
`ఖుషి` సినిమాని రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శివ నిర్వాణ. ఫ్యామిలీ అంశాలు, కొంత డ్రామా మేళవింపుగా ఈ సినిమా సాగుతుందట. మెచ్యూర్డ్ లవ్ స్టోరీ ఉంటుందని తెలుస్తుంది. `మజిలి` తర్వాత సమంత, మొదటి విజయ్ దేవరకొండ.. దర్శకుడు శివ నిర్వాణతో కలిసి పనిచేస్తున్నారు. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 1న విడుదల కానుంది.