
ఆర్ ఆర్ ఆర్ - ది ఎలిఫెంట్ విస్పర్స్ భారతీయ సినిమా ఖ్యాతిని చాటాయి. అంతర్జాతీయ సినిమా వేదికపై సగర్వంగా తలెత్తుకునేలా చేశాయి. భారతీయులకు ఆస్కార్ అందని ద్రాక్ష కాదని, మన చిత్రాలకు కూడా ఆ స్థాయి, సత్తా ఉందని నిరూపించాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకోగా... బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ అవార్డు అందుకుంది.
ఈ రెండు చిత్రాలు డిఫరెంట్ జోనర్లో తెరకెక్కినవి. ఆర్ ఆర్ ఆర్ ప్యూర్ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా. రాజమౌళి 1920ల నాటి ఇద్దరు వీరుల కథగా తెరకెక్కించారు. రామ్, భీమ్ లక్ష్యాలు వేరైనా శత్రువు మాత్రం ఒక్కడే. ఆ శత్రువును ఓడించేందుకు వారు ఎంచుకున్న మార్గాలు వేరు. ఆ క్రమంలో ఇద్దరికీ సంఘర్షణ ఏర్పడుతుంది. ఎన్టీఆర్, చరణ్ లు భీమ్, రామ్ పాత్రల్లో అద్భుతం చేశారు.
రాజమౌళి సిల్వర్ స్క్రీన్ పై ఊహకు మించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ఆవిష్కరించారు. ఇక ఆస్కార్ గెలవడం వెనుక కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవల కృషి ఎంతగానో ఉంది. అయితే పాటకు ప్రాచుర్యం దక్కడానికి ప్రేమ్ రక్షిత్ ప్రధాన కారణమయ్యాడు. నాటు నాటు సాంగ్ కి ఆయన రూపొందించిన కొరియోగ్రఫీ వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని మెప్పించింది. హాలీవుడ్ మేకర్స్ ప్రముఖంగా మాట్లాడుకునేలా చేశాయి. ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన డాన్స్ మూమెంట్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వారం రోజులు ప్రాక్టీస్ చేశారు. ఇద్దరూ కలిసి గొప్ప అవుట్ ఫుట్ ఇచ్చారు. మొత్తంగా సమిష్టి కృషితో ఆస్కార్ అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు.
ఇక ది ఎలిఫెంట్ విస్పరర్స్ విషయానికి వస్తే... ఇది నిజ జీవితాల ఆధారంగా రూపొందించిన డాక్యూమెంటరీ. ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీలో ఏం చెప్పారంటే... మూడు నెలల వయసున్న ఏనుగు పిల్ల రఘు తన తల్లికి దూరం అవుతుంది. అనాధ అయిన ఆ పిల్ల ఏనుగు సంరక్షణ బాధ్యత అడవి తెగకు చెందిన బొమ్మ, బెల్ల తీసుకుంటారు. చిన్నప్పటి నుండి బొమ్మ, బెల్లతో పెరిగిన రఘు వారి ఫ్యామిలీ మెంబర్ అవుతుంది. వారితో విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వారి మధ్య అనుబంధం ఏర్పడుతుంది. తల్లి నుండి విడిపోయి బొమ్మ, బెల్లికి దగ్గరైన రఘు వాళ్ళకు దూరం కావాల్సి వస్తే ఎలాంటి పరిస్థితి నెలకుంటుందనేది హృద్యంగా చూపించారు.
ది ఎలిఫెంట్ విస్పరర్స్ కోసం దర్శకురాలు కార్తీకి ఏళ్ల తరబడి పరిశోధన చేశారు. మనుషులకు, ఏనుగుకు మధ్య అనుబంధాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. కార్తీకి గతంలో యానిమల్ ప్లానెట్, డిస్కవరీ ఛానల్స్ లో కెమెరా ఆపరేట్ గా పని చేశారు. ఈ అనుభవం ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ తెరకెక్కించేందుకు ఉపయోగపడింది. ముదుమలై నేషనల్ పార్క్ పై ఆమెకు పూర్తి అవగాహన ఉంది. కారణం కార్తీకి పుట్టి పెరిగిన ప్రాంతం అదే. నీలగిరి కొండల్లో గల ఊటీ కార్తీకి బర్త్ ప్లేస్. ఆ ప్రాంతంతో తనకున్న అనుభవాలు డాక్యుమెంటరీలో అద్భుతంగా ఆవిష్కరించగలిగారు.