
మహేష్, కొరటాల శివ చిత్రంలో హీరోయిన్ గా ముందు కీర్తి సురేష్‌నే అనుకున్నారు. కానీ డేట్స్ కుదరకపోవడంతో ఆమె స్థానంలో ధోనీ సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ నటి కియారా అద్వానీని తీసుకున్నారు. మహేష్‌లాంటి పెద్ద స్టార్‌తో ఛాన్స్ మిస్ అవడం అంటే అది చాలా దారుణంగా దెబ్బతిన్నట్టే.
కానీ కీర్తి సురేష్ మాత్రం దాని గురించి పెద్దగా బెంగ పడాల్సిన పని లేకుండా వరుసగా పెద్దపెద్ద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న కీర్తి, మహానటి 'సావిత్రి' జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'మహానటి'లో టైటిల్ రోల్ చేస్తోంది. తమిళంలో విజయ్, అజిత్, సూర్య లాంటి టాప్ స్టార్స్ అందరితోను నటిస్తూ బిజీగా వుంది.
కీర్తి తాజాగా విక్రమ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. 'సామి' చిత్రానికి సీక్వెల్ చిత్రంలో కీర్తి సురేష్ ఒక కథానాయికగా ఎంపికైంది. ప్రస్తుతం తమిళనాట తనంత బిజీగా వున్న హీరోయిన్ ఇంకొకరు లేరు. త్రిష, నయనతార తర్వాత అగ్ర హీరోలు అందరూ ఇప్పుడు కీర్తి వెంటే పడుతున్నారు.
ఇక పవన్, త్రివిక్రమ్ ల సినిమా రిలీజ్ అయిందంటే తెలుగులోనూ కీర్తి సురేష్ స్టార్‌డమ్ అమాంతం పెరిగిపోతుంది. నేను శైలజ, నేను లోకల్ లాంటి వరుస సూపర్‌హిట్లు వున్నాయి కనుక ఇక తనకి కావాల్సిందొక పవర్‌ఫుల్ హిట్టే. అదీ వచ్చేస్తే మళ్లీ మహేష్ లాంటి హీరోల సరసన ఛాన్స్ రావడమే కాక కీర్తి సురేష్ టాపర్ గా నిలిచే అవకాశాలున్నాయి.