మూడు వేల మందికి ఐదు వేలు.. `కేజీఎఫ్‌` స్టార్‌ యష్‌ సంచలన నిర్ణయం..

By Aithagoni RajuFirst Published Jun 2, 2021, 10:57 AM IST
Highlights

కరోనాతో 24 విభాగాల అసిస్టెంట్లు, సినీ కార్మికులు రోడ్డున పడ్డ పరిస్థితి. దీంతో ఆదుకునేందుకు ముందుకొచ్చాడు యష్‌. కన్నడ చిత్ర పరిశ్రమలో 21 డిపార్ట్ మెంట్లకి సంబంధించి మూడు వేల మందికి సహాయం చేసేందుకు కదిలాడు. 

`కేజీఎఫ్‌` చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారి విలయతాండవం ఇంకా కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమలన్నీ ఆగిపోయాయి. షూటింగ్‌లు నిలిచిపోయాయి. థియేటర్లు బంద్‌ అయ్యాయి. దీంతో సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. రోజు వారి కూలీపై ఆధారపడే జూ ఆర్టిస్టులు, ఇతర 24 విభాగాల అసిస్టెంట్లు రోడ్డున పడ్డ పరిస్థితి. దీంతో ఆదుకునేందుకు ముందుకొచ్చాడు యష్‌. కన్నడ చిత్ర పరిశ్రమలో 21 డిపార్ట్ మెంట్లకి సంబంధించి మూడు వేల మందికి సహాయం చేసేందుకు కదిలాడు. 

21 విభాగాలకు చెందిన మూడు వేల మంది పేద కార్మికులకు రూ. ఐదు వేల చొప్పున ఆర్థిక సాయాన్ని చేయబోతున్నారు. డైరెక్ట్ గా వారి బ్యాంక్ ఖాతాలోనే ఈ అమౌంట్‌ని వేయబోతున్నాడు యష్‌. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా యష్‌ మాట్లాడుతూ, `కరోనా కనిపించని శత్రువు. ప్రజల ప్రాణాలను బలిగొంటుంది. వారికి జీవనోపాధి లేకుండా చేస్తుంది. నా సొంత కన్నడ సినీ పరిశ్రమ కూడా ఈ మహమ్మారికి ప్రభావితమైంది. 

ఈ క్లిష్ట సమయంలో ఇండస్ట్రీలోని 21 విభాగాలలో ఇబ్బందులు పడుతున్న 3000 మంది సభ్యులకు.. నా సంపాదన నుంచి ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు పంపిస్తున్నాను. ఈ సాయం వారి కష్టాలనన్నింటినీ తీర్చలేదని తెలుసు. కానీ ఎంతో కొంత ఊరటనిస్తుంది. మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ఉందాం` అని తెలిపారు యష్‌. దీనికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. సినీ కార్మికులు తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. పలువురు సినీ పెద్దలు అభినందిస్తున్నారు. 

pic.twitter.com/46FYT9pThz

— Yash (@TheNameIsYash)

యష్‌ ప్రస్తుతం `కేజీఎఫ్‌ః ఛాప్టర్‌2`లో నటిస్తున్నారు. `కేజీఎఫ్‌` తొలి భాగానికి కొనసాగింపు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌, రావు రమేష్‌ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా జులైలో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా విడుదలపై సస్పెన్స్ నెలకొంది. 

click me!