
సినీ పరిశ్రమలోని హీరోయిన్ గా ఎదగాలంటే నీచ సంస్కృతికి పాల్పడాల్సిన దుస్థితి అనాదిగా ఉందా... అంటే ఉందని అనిపిస్తోంది ఇటీవల కొందరి హీరోయిన్ల కమెంట్లు వింటే. దాని గురించి ఇటీవలి కాలంలో చాలామంది హీరోయిన్లు మీడియా ముందు మాట్లాడుతున్నారు. హీరోయిన్లు రాధికా ఆప్టే, అర్చన, మాధవీలత, శృతి హరిహరన్ తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ జాబితాలో సీనియర్ హీరోయిన్ కస్తూరి చేరింది.
ఒకప్పుడు తమిళ, తెలుగు భాషల్లో బిజీ హీరోయిన్ అయిన కస్తూరి.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. తాజాగా వ్యక్తిగత పనిపై చెన్నై వచ్చిన కస్తూరి ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ.. తన వ్యక్తిగత అనుభవాన్ని వెల్లడించింది.
ఓ తెలుగు హీరో తనను పడకగదికి రప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేశాడని, అయితే ఆ హీరోకు తాను లొంగలేదని చెప్పింది. దాంతో ఆ హీరో తనను వేధించేవాడని, తర్వాతి రెండు సినిమాల నుంచి తనను తప్పించాడని చెప్పింది. ఆ హీరోకు అహంకారం బాగా ఎక్కువని, నిజ జీవితంలో కూడా ‘నో’ అని వినడం ఆయనకు నచ్చదని తెలిపింది. ఆ తెలుగు హీరోతో తను ఒకే ఒక చిత్రంలో నటించానని, తను లొంగకపోవడంతో సెట్‌లో ఎప్పుడూ తనపై కోపం ప్రదర్శించేవాడని తెలిపింది. ప్రస్తుతం ఆ హీరో ప్రస్థుతం రాజకీయాల్లో ఉన్నాడని, అయితే అతని పేరు మాత్రం వెల్లడించలేనని చెప్పింది.