
సాధారణంగా త్రివిక్రమ్ రచన చేస్తూ, డైరక్ట్ చేసిన సినిమాలు ఇతర భాషల్లో వర్కవుట్ కావటం కష్టం. ఎందుకంటే ఆయన రచనలో ఉండే మ్యాజిక్ రిపీట్ చేయటం కష్టం. అది చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. అయితే ఆయన హిట్ ఇచ్చిన ప్రతీ సారీ ఆ సినిమా రీమేక్ అవుతోంది. ఆ క్రమంలో తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురములో’ చిత్రం హిందీ లో రీమేక్ చేసారు. షెహజాదాగా ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించారు. రోహిత్ ధావన్ దర్శకత్వంలో.. యువహీరో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించారు.ఈ చిత్రం శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందన, క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల నుంచి కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. దాంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఒక టికెట్ కొంటే.. రెండో టికెట్ ఉచితం అనే స్కీమ్ పెట్టారు. అయినా పెద్దగా రెస్పాన్స్ లేదు. మల్టీప్లెక్స్‌లో తప్పించి.. మాస్ ఏరియాల్లో కలెక్షన్స్ కనపడటం లేదు.
ఈ చిత్రం హిందీ ఆడియన్స్ లో వర్కౌట్ కాకపోవడానికి ప్రధాన కారణం ఒకటి అల్లు అర్జున్ స్టైల్ రిపీట్ కాకపోవటం, మరొకటి త్రివిక్రమ్ సెల్యులాయిడ్ మ్యాజిక్ అక్కడ క్రియేట్ చేయలేకపోవటం అంటున్నారు. ఇక ఈ చిత్రం నిర్మాణంలో గీతా ఆర్ట్స్, హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ కూడా భాగమయ్యాయి. పఠాన్ వల్ల వాయిదా పడి ఫిబ్రవరి 17న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి అలవైకుంఠపురంలో సినిమాతో సమస్య వచ్చింది. గతంలో అల్లుఅర్జున్ పుష్ప రిలీజయి బాలీవుడ్ లో హిట్ అయినప్పుడు అలవైకుంఠపురంలో సినిమాని కూడా హిందీలో థియేట్రికల్ రిలీజ్ చేద్దామని అల్లు అరవింద్ అనుకున్నారు. కానీ అప్పటికే ఈ సినిమా రీమేక్ షూట్ మొదలుపెట్టడంతో హీరో కార్తీక్ ఆర్యన్ ఆ సినిమా రిలీజ్ చేస్తే నేను షెహజాదా సినిమా నుంచి వెళ్ళిపోతాను అని చెప్పడంతో ఆగిపోయారు. అలవైకుంఠపురంలో సినిమా హిందీలో థియేట్రికల్ రిలీజ్ చేస్తే షెహజాదా సినిమాని ఎవ్వరూ పట్టించుకోరు. దీంతో అల్లు అరవింద్ ఆ ఆలోచనని ప్రక్కన పెట్టేసారు.
మన తెలుగు సినిమాలన్నీ హిందీలో డబ్బింగ్ చేసి గోల్డ్ మైన్స్ అనే ఓ యూట్యూబ్ ఛానల్ కి అమ్ముతారు. మన సినిమాలకి అక్కడ మంచి డిమాండ్ ఉండటంతో ఆ ఛానల్ కూడా ఎక్కువ రేట్లు పెట్టి మన సినిమాలని కొనుక్కుంటుంది. అయితే గతంలోనే అలవైకుంఠపురంలో సినిమాని గోల్డ్ మైన్స్ ఛానల్ కి అమ్మారు. కానీ షెహజాదా సినిమా చేస్తుండటంతో కొన్ని రోజులు వాయిదా వేయాలని, యూట్యూబ్ లో అప్పుడే రిలీజ్ చేయొద్దని నిర్మాణ సంస్థలు కోరడంతో గోల్డ్ మైన్స్ ఆగింది. కానీ ఇది జరిగి సంవత్సరం దాటేస్తుంది. షెహజాదా అనుకున్న టైంకి రిలీజ్ అవ్వక వాయిదా పడుతూ వస్తుండటంతో ఇంక గోల్డ్ మైన్స్ ఛానల్ ఆగలేదు.
అలవైకుంఠపురం సినిమా హిందీ వర్షన్ ని తమ ఛానల్ లో ఫిబ్రవరి 2 నుంచి రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో షెహజాదా సినిమాకి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. అలవైకుంఠపురంలో సినిమా హిందీ వర్షన్ ఫిబ్రవరి 2న యూట్యూబ్ లో విడుదలైతే దాని రీమేక్ షెహజాదా సినిమా ఫిబ్రవరి 17న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. దీంతో ఈ సినిమాకి వచ్చే ప్రేక్షకులు తగ్గారనే భావిస్తున్నారు.