
దర్శక ధీరుడు రాజమౌళిని ఏమైనా అంటే ఊరుకునేది లేదు కాంట్రవర్షియల్ క్వీన్ కంగనా రనౌత్ సీరియర్ వార్నింగ్ ఇస్తోంది. రాజమౌళికి మద్దతుగా కంగనా రనౌత్ ట్విట్టర్ లో వరుస ట్వీట్స్ వేస్తోంది. రామౌళిపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ తిరుగుతోంది. ట్రోలింగ్ వెనుక ఉన్న సంగతి ఏంటి.. అసలు ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు వివరాల్లోకి వెళదాం.
రాజమౌళి ఇటీవల ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మతవిశ్వాసాలపై తన అభిప్రాయం తెలిపారు. మాది చాలా పెద్ద కుటుంబం. మా ఇంట్లో మత విశ్వాసాలు ఎక్కువగా ఉంటాయి. హిందీ దేవతల కథలు విన్నప్పుడు, చదివినప్పుడు అవి నిజం కాదేమో అని అనుకునేవాడిని. కానీ మా కుటుంబ సభ్యుల లాగే నేను కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడిచా. తీర్థ యాత్రలు చేసి కాషాయం ధరించా. నా స్నేహితుల వల్ల క్రైస్తవ మతాన్ని కూడా అనుసరించా. బైబిల్ చదివా.
కానీ నాకు చివరకి అర్థం అయింది ఏంటంటే.. మతాలు అనేవి స్వలాభం కోసమే అని. ఆ తర్వాత మతానికి దూరంగా ఉంటూ వచ్చా. కానీ హిందూ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతంపై ప్రేమని మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. రామాయణం, మహాభారతాలని మతాల కోణంలో చూడడం మానేసి గొప్ప కథలుగా ఆవిష్కరించడం మొదలు పెట్టా అని రాజమౌళి అన్నారు.
జక్కన్న మతాల గురించి మాట్లాడడంతో ఆయనపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది. హిందూ మత విశ్వాసాలపై రాజమౌళి ఎలాంటి సందేశం ఇవ్వాలని చూస్తున్నారు అంటూ మండి పడుతున్నారు. రాజమౌళిని వివాదంలోకి లాగాలని చూస్తున్న వారిపై కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించింది.
ఆయనకి మద్దతుగా వరుస కామెంట్స్ చేసింది. రాజమౌలి ఇంటర్వ్యూలో అనేక విషయాలపై మాట్లాడారు. కానీ ఆయన మతంపై చేసిన కామెంట్స్ ని మాత్రమే హైలైట్ చేసి వివాదం సృష్టించాలని చూస్తున్నారు. మరీ అతిగా స్పందించాల్సిన అవసరం లేదు. మేము సినిమా వాళ్ళం కావడం వల్లే అందరూ మాపై దాడి చేస్తారు. రాజమౌళి సర్ ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు. ఆయన వర్షంలో మండే నిప్పు, జీనియస్. అలాంటి వ్యక్తి దొరకడం మన అదృష్టం అని కంగనా మద్దతుగా నిలిచింది.
రాజమౌళిని ఎందుకు వివాదాస్పద వ్యక్తిగా ముద్ర వేస్తున్నారు. బాహుబలితో దేశం ఖ్యాతి పెంచినందుకా ? ఆర్ఆర్ఆర్ తీసినందుకా ? అంతర్జాతీయ వేదికలపై ధోతి ధరించినందుకా అంటూ కంగనా ట్రోలర్స్ ని సూటిగా ప్రశ్నించారు.