
కన్నడ చిత్రం 'కాంతార చాప్టర్ 1' చిత్రీకరణ సమయంలో బోటు మునిగిపోయి ప్రమాదం జరిగింది. చిత్రంలో ప్రముఖ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టితో సహా 30 మంది బోటులో ఉన్నప్పటికీ, అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
శనివారం మేళిన దగ్గర ఉన్న సరస్సులో ఈ ప్రమాదం జరిగింది. సరస్సులో లోతు తక్కువగా ఉన్న ప్రాంతంలో ప్రమాదం జరగడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని తెలిసింది.
తీర్థహళ్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు.
ప్రమాదం గురించి మరింత దర్యాప్తు జరుగుతోంది. సెట్‌లో ఉన్నవారే రక్షణ చర్యలు చేపట్టారని పోలీసులు తెలిపారు. కెమెరా, కొన్ని షూటింగ్ సామాగ్రి సరస్సులో పడిపోయాయని కూడా వార్తలు వస్తున్నాయి.
'కాంతార: చాప్టర్ 1' చిత్రీకరణ ఉడుపి, చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ చిత్ర నిర్మాణంలో ఇంతకు ముందు కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి.
మే నెలలో, సౌపర్ణిక నదిలో జూనియర్ ఆర్టిస్ట్ ఎం.ఎఫ్. కపిల్ మునిగి మరణించడంతో చిత్రీకరణ తాత్కాలికంగా నిలిపివేశారు.
రిషబ్ శెట్టి ప్రజాదరణ పొందిన చిత్రం 'కాంతార'కు ప్రీక్వెల్ గా 'కాంతార: చాప్టర్ 1' రూపొందుతోంది. ప్రమాదం తర్వాత చిత్రీకరణ తాత్కాలికంగా నిలిపివేశారా అనే దానిపై స్పష్టత లేదు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్రీకరణ వేగంగా జరుగుతోందని సమాచారం. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా చిత్రాలను నిర్మించిన హోంబాలే ఫిలిమ్స్ కాంతార చాప్టర్ 1ని నిర్మిస్తోంది. మలయాళ నటుడు జయరాం చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.