
కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడకు సుప్రీంకోర్టు గట్టి షాకే ఇచ్చింది. అభిమానిని చంపిన కేసులో వీరిద్దరి బెయిల్ సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీనితో బెంగళూరు పోలీసులు తిరిగి వారిని అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు నుంచి తీర్పు ఇలా వెలువడిందో లేదో బెంగళూరు పోలీసులు పవిత్ర గౌడ ఇంటికి వెళ్లి ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత దర్శన్ కూడా అదుపులోకి తీసుకున్నారు. దర్శన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి తెలుసుకోగానే సీక్రెట్‌గా బెంగళూరులో ఉన్న తన భార్య ఇంటికి వెళ్ళాడు. అక్కడ తన భార్య, కొడుకును కలిసి మాట్లాడాడు. ఈలోపే పోలీసులు వచ్చి అతన్ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు.
దర్శన్ అభిమాని అయిన రేణుక స్వామి హత్య కేసులో పవిత్ర గౌడ, దర్శన్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఇక గతేడాది డిసెంబర్ లో హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ బెయిల్ ను రద్దు చేయాలని కర్ణాటక పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈరోజు మధ్యాహ్నం తీర్పును వెలువరించింది.
కర్ణాటక కు చెందిన రేణుక స్వామి దర్శన్ కు వీరాభిమాని. దర్శన్ భార్యా బిడ్డలను పక్కనపెట్టి పవిత్ర గౌడతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. గత పదేళ్లగా వీరి అనుబంధం కొనసాగుతోంది. దీంతో రేణుక స్వామి పవిత్రకు అసభ్య సందేశాలు పంపేవాడు. ఈ విషయం దర్శన్ కు తెలియడంతో అతడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరో 15 మంది నిందితులుగా ఉన్నారు. రేణుక స్వామిని అత్యంత హీనంగా పాశవికంగా దాడి చేసి చంపినట్టు విచారణలో తెలిసింది. పోస్టుమార్టం నివేదిక చూశాక ఒక అభిమాని పై ఇంత కక్ష పెట్టుకోవడం ఏంటనే చర్చ కూడా సాగింది.
సుప్రీంకోర్టు ఈ కేసు గురించి ఈరోజు మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వులు సాంకేతిక లోపం కారణం వల్ల బెయిలు మంజూరు చేసి ఉంటారని అభిప్రాయపడింది. నిందితుడు ఎంత పెద్దవాడైనా కూడా చట్టానికి అతీతుడు కాదని సుప్రీంకోర్టు చెప్పింది. చట్టం ముందు అందరూ సమానమేనని వివరించింది. ఈ నిందితులకు జైల్లో ఫైవ్ స్టార్ సౌకర్యాలు కల్పించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ విషయం గురించి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ జైలు సూపరెండెంట్‌ను సస్పెండ్ చేసి ఉండాలని చెప్పింది. జైలులో దర్శన్ విలాసవంతమైన జీవితం గడిపినట్టు ఎన్నో ఆధారాలు బయటికి వచ్చాయి.
రేణుక స్వామికి 33 ఏళ్లు అతని భార్య గర్భంతో ఉంది. గతేడాది జూన్ 9న అతడి మృతదేహం ఒక ఫ్లైఓవర్ పై పడి కనిపించింది. పవిత్ర గౌడ వల్లే ఈ హత్య జరిగిందని అందరూ అభిప్రాయపడుతున్నారు. అసభ్యసందేశాలు పంపితే వారిని ఇచ్చి వదిలిపెట్టాలి. కానీ పాశవికంగా చంపడం ఏంటని అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది.