
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ కన్నడ దర్శకుడు కన్నుమూశారు. శాండల్‌వుడ్ సీనియర్ దర్శకుడు సీవీ శివ శంకర్(90) మంగళవారం(జూన్27)న తుది శ్వాస విడిచారు. గుండెపోటు కారణంగా బెంగుళూరులో కన్నుమూసినట్టు ఆయన కుమారుడు వెంకట్ భరద్వాజ్ వెల్లడించారు. దీంతో సీవీ శివ శంకర్ మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
దర్శకుడు శివ శంకర్.. 1962లో తన సినిమా కెరీర్‌ని ప్రారంభించారు. ఆయన తొలుత నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. `రగ్న మంజరి` చిత్రంలో నటించారు. అంతేకాదు ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పనిచేశారు. వరుసగా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వచ్చారు. 1965లో `మనే కట్టి నోడు` అనే సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాని సీవీ శివశంకర్ తన స్నేహితులతో కలిసి నిర్మించడం విశేషం.
1967లో `పదవిధర` సినిమాతో దర్శకుడిగా మారారు. ఉదయ్ కుమార్, కల్పన, టీ ఎన్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అయితే సక్సెస్ వచ్చినా ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు. ఆ తర్వాత `నమ్మ ఓరు` సినిమాని రూపొందించారు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఆయన సినిమాలకుగ్యాప్ ఇచ్చారు. దర్శకుడిగా సినిమాలు ఆపేశారు.
నిర్మాతగా `ఏ డే ఇన్ ది సిటీ` చిత్రాన్ని నిర్మించారు. మరోవైపు 2016లో `బబ్లుషా` చిత్రాన్ని నిర్మించారు. ఆయన చిత్ర పరిశ్రమకి చేసిన సేవలకుగానూ కన్నడ రాష్ట్ర ప్రభుత్వం కర్నాటక రాజ్యోత్సవ అవార్డుని ప్రదానం చేసింది. సీవీ శివశంకర్ దర్శక, నిర్మాతనే కాదు, మంచి రైటర్ కూడా. అనేక సినిమాలకు ఆయన పాటలు రాశారు. వాటిలో `బెంగుళూరు నగారా`, `సిరివంతనాదరూ కన్నడ నాదల్లే మెరేవే`, `ఆనందదా తవరూరు` వంటి సూపర్ హిట్ పాటలు రాశారు.
సీవీ శివ శంకర్కి భార్య రాధమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు వెంకట్ భరద్వాజ్ కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. వెంకట్ రెండు సినిమాలు తండ్రితో కలిసి పనిచేశారు.