
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎర్రచందనం స్మగ్లర్ గా, కూలీగా బన్నీ నటన.. యాటిట్యూడ్ అందరికి విపరీతంగా నచ్చేశాయి. బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీనితో పార్ట్ 2 పై మంచి క్రేజ్ ఏర్పడింది.
పార్ట్ 1లో యువతని బాగా ఆకట్టుకున్న అంశాలలో సమంత తొలిసారి చేసిన ఐటెం సాంగ్ కూడా ఉంది. ' ఊ అంటావా మావ' అంటూ సమంత అందాలు ఆరబోస్తూ మత్తుగా చేసిన డాన్స్ కు కుర్రాళ్ళు ఫిదా అయ్యారు. ఈ సాంగ్ కు అన్ని భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా తెలుగులో ఈ సాంగ్ బాగా వైరల్ అయింది.
వివిధ భాషలో వివిధ సింగర్స్ ఈ పాటని పాడారు. తెలుగులో ప్రముఖ సింగర్ మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహన్ ఈ పాటని అద్భుతంగా పాడారు. కన్నడలో మంగ్లీ పాడింది. తమిళంలో ప్రముఖ నటి, సింగర్ ఆండ్రియా ఈ పాటకు గాత్రం అందించారు. ఇక హిందీలో ఈ సాంగ్ ని కనికా కపూర్ పాడారు.
కనికా కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సాంగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'ఊ బోలేగా' సాంగ్ నా ఫ్రెండ్స్, సన్నిహితులు ఎవరికీ నచ్చలేదు. వాళ్ళు డైరెక్ట్ గా మెసేజ్ లు పెట్టారు. 'ఏమీ అనుకోకు ఊ బోలేగా సాంగ్ అసలు బాగాలేదు' అని చెప్పేశారు. కానీ తాను విమర్శలని లైట్ తీసుకుంటానని కనికా కపూర్ పేర్కొంది.
సాంగ్ బాగా పాపులర్ అయింది. ప్రేక్షకులకు నచ్చేసింది. అలాంటప్పుడు విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది కనికా. తెలుగులో కూడా ఊ అంటావా సాంగ్ పై ఎన్నో విమర్శలు ఎదురయ్యా. మగవాళ్ళని ఉద్దేశిస్తూ ఇంత అసభ్యంగా పాట రాస్తారా అంటూ పురుషుల సంఘం పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.