
విలక్షణ నటుడు కమల్ హాసన్ అంటే తమిళనాట వున్న క్రేజే వేరు. కమల్ ఇటీవల జయలలిత మరణానంతరం తమిళ రాజకీయాలపై కాస్త ఎక్కువగానే దృష్టిపెట్టారని ఆయన సోషల్ మీడియాలో చేస్తున్న కమెంట్స్ చూస్తే తెలుస్తుంది. తాజాగా కమల్ హాసన్ సంచలనాత్మక విషయాలు వెల్లడించారు.
తరచూ వివాదాలలో ఉండడం తమిళ , తెలుగు హీరో కమల్ హాసన్ కి కొత్తేమీ కాదు. ఆయన రాజకీయాలలోకి రాబోతున్నారు అనే న్యూస్ తెలిసిన దగ్గర నుంచీ అనేక సార్లు అనేకమంది ఆయనని విమర్శించడం , ప్రభుత్వం మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చెయ్యడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా ఆయన మీడియా తో మాట్లాడుతూ తాను కొత్త పార్టీ పెడుతున్నా అని ప్రకటించిన దగ్గర నుంచీ తనని చంపేస్తా అంటూ ఫోన్ లు వస్తున్నాయి అని చెప్పుకొచ్చారు. " నేను ఏ పార్టీ లోనూ చేరడం లేదు, నాకంటూ కొత్త పార్టీ పెడుతున్నా. ఈ ఏడాది నవంబర్ లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కూడా చేస్తాను " అని ప్రకటించారు.
"దేశం లో మార్పు అవసరం , అందుకే నేను రాజకీయాలలోకి రావడానికి నా అభిమానుల సహాయంతో సిద్ధం అయ్యాను. అయితే ఇది చాలామందికి నచ్చడం లేదు .. నన్ను చంపేస్తాం అంటున్నారు. పార్టీ పెట్టొద్దు అనేది వారి ప్రధాన వాదన " అంటూ చెప్పుకొచ్చారు కమల్. తాను భయపడే రకాన్ని కాను అనీ పార్టీ పెట్టి తీరతాను అంటున్నారు కమల్ హాసన్.