సినిమాటోగ్రఫీ చట్టంపై కమల్‌, సూర్య, అనురాగ్‌..ప్రముఖుల అభ్యంతరాలు

By Aithagoni RajuFirst Published Jul 3, 2021, 4:56 PM IST
Highlights

సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినీ ప్రముఖుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 

సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినీ ప్రముఖుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాకి సెన్సార్‌ చేసే అధికారం ఉన్న సంస్థ సీబీఎఫ్‌సీ జారీ చేసే సర్టిఫికేట్స్ ని ఇకపై కేంద్ర ప్రభుత్వం తన అధికారంలోకి తీసుకోవడానికి ప్లాన్‌ చేస్తుంది. దీంతో దీనిపై సర్వత్రా సినీ ప్రముఖుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇది భావ వ్యక్తికరణ స్వేచ్ఛని హరించివేయడమేనని, కేంద్రం జోక్యం తగదంటూ కమల్‌ హాసన్‌, సూర్య, వెట్రిమారన్‌, హీరోయిన్‌ ప్రణీతా సుభాష్‌, అనురాగ్‌ కశ్యప్‌, పర్హాన్‌ అక్తర్‌, నందితా దాస్‌, షబానా అజ్మీ, జోయా అక్తర్‌ వంటి వారు అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు. 

సినిమాటోగ్రఫీ యాక్ట్‌ను సవరించడానికి కేంద్ర ప్రభుత్వం 2013లో జస్టిస్‌ ముఖల్‌ ముగ్దల్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే 2016లో శ్యామ్‌ బెనగల్‌ నేతృత్వంలో మరో కమిటీని  ఏర్పాటు చేశారు. ఈ రెండు కమిటీలు తమ నివేదికలను కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు తాజాగా అందించారు. వీటి ప్రకారం కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ యాక్ట్‌ 2021 బిల్లును రూపొందించింది. అందులో భాగంగా.. సీబీఎఫ్‌సీ ఇచ్చిన సర్టిఫికెట్‌ను పునః పరిశీలించాలనే సదరు సంస్థ చైర్మన్‌ను ఆదేశించే అధికారాన్ని కేంద్రానికి ఉండేలా చట్టాలను సవరిస్తామని ప్రతిపాదన తెచ్చింది. 

అలాగే సినిమా సెన్సార్‌ సర్టిఫికేట్స్‌(యు,యు/ఎ, ఏ,ఎస్‌) కొన్ని మార్పులను సూచించింది. సర్టిఫికేషన్‌ కాల పరిమితి 10 ఏళ్లు. అయితే ఉత్తర్వుల ద్వారా ఈ కాల పరిమితిని రద్దు చేశారు. దానికి అవసరమైన సవరణలు చేయనున్నట్లు తెలిపారు.  సినిమా పైరసీకి పాల్పడితే కనిష్టంగా మూడు  నెలల నుంచి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్షతో పాటు మూడు లక్షల రూపాయల జరిమానా విధించారు. నిర్మాణ వ్యయంలో ఐదు శాతం డబ్బను జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. 

దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను దెబ్బ తీసేలా, శాంతి భద్రతలను విఘాతం కలిగించేలా సినిమాలు ఉన్నాయంటూ కేంద్రానికి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో దేశ సార్వ భౌమత్యం, అంతర్గత భద్రత వంటి విషయాల్లో భావ ప్రకటన స్వేచ్చకు సహేతుక అంక్షలు ఉండవచ్చునని కేంద్రం భావించి సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు చేస్తున్నట్టు తెలిపింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టాలని కేంద్రం భావిస్తోంది. తాజా వ్యతిరేకత నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే ఆసక్తికరంగా మారింది. 

click me!