
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ "భారతీయుడు" అప్పట్లో సెన్సేషన్. ఆ సినిమా విడుదల అయిన దాదాపు పాతికేళ్ళ తర్వాత తాజాగా కమల్ హాసన్ మరియు శంకర్ కలిసి "భారతీయుడు-2" సినిమా మొదలెట్టారు. లైకా ప్రొడక్షన్స్ వంటి పెద్ద సంస్ద ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చింది. మొదట్లో అంతా బాగానే ఉన్నప్పటికీ తరువాత బడ్జెట్ విషయంలో నిర్మాతలకు శంకర్ కి మధ్య వివాదాలు మొదలైన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు శంకర్ మీద కేసు కూడా పెట్టారు. చాలాకాలంపాటు కోర్టులో నలిగిన ఈ కేసు నుండి శంకర్ ఈ మధ్యనే బయటపడ్డారు. అయితే ఇప్పుడు డైరక్టర్ గా శంకర్ కాకుండా కమల్ పేరు వినిపిస్తోంది. విక్రమ్ సినిమా ప్రమోషన్ లో ఉన్న కమల్ ని ఈ విషయమై మీడియా వర్గాలు ప్రశ్నించాయి.
కమల్ సమాధానమిస్తూ..."ఈ సినిమాకు నేను దర్శకత్వం వహించడం లేదు. శంకర్ సినిమాని టేకప్ చేస్తారు. అయితే ప్రస్తుతం శంకర్ వేరే ప్రాజెక్ట్ (రామ్ చరణ్ సినిమా)తో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత నా సినిమా మొదలవుతుంది. నా నుంచి వెంట వెంటనే సినిమాలు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. నాకు కూడా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలని ఉంది. కానీ దర్శకత్వ బాధ్యత కూడా నేను నెత్తి మీద పెట్టుకుంటే అది కుదరదు. అందుకే ఆ బాధ్యతలు వేరే దర్శకులకి అప్పగిస్తున్నాను" అని క్లారిటీ ఇచ్చారు కమల్ హాసన్.
అలాగే "సినిమాకి సంబంధించి 60 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. ప్రస్తుతానికి మేము ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నాము. 'విక్రమ్' సినిమా పనుసు పూర్తయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్ళి మొదలవుతుంది," అని క్లారిటీ ఇచ్చారు కమల్ హాసన్. అంతేకాకుండా ఈ మధ్యనే ఫాహాధ్ ఫాసిల్ హీరోగా నటించి సూపర్ హిట్ అయిన "మాలిక్" సినిమాకి దర్శకత్వం వహించిన మహేష్ నారాయణ తదుపరి సినిమా కోసం కమల్ హాసన్ స్క్రిప్టు అందిస్తున్నారు. ఈ విషయం కమల్ హాసన్ స్వయంగా రివీల్ చేశారు.