
దాదాపు 28 ఏళ్ల కిందట వచ్చిన ‘భారతీయుడు’చిత్రం అప్పట్లో సెన్సేషన్. కమల్ హాసన్ నటన, శంకర్ డీల్ చేసిన విధానం, ఆయన మార్క్ దర్శకత్వం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటుంటాం. సీక్వెల్ చిత్రాల ట్రెండ్ నడుస్తున్న వేళ శంకర్ కూడా ‘భారతీయుడు 2’ తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమాని ప్రకటించిన రోజు నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు రేకెత్తించిన ఈ చిత్రం అనుకున్న స్దాయిలో లేదు. మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ నడిచింది. రెండోసారి సేనాపతి దేని కోసం పోరాటం చేశాడు? అనేది క్లారిటీ లేకుండా పోయిందనే విమర్శలు వినిపించాయి. ఇది ప్రక్కన పెడితే ఈ సీక్వెల్ సినిమాకు కమల్ ఎంత ఛార్జ్ చేసాడనేది హాట్ టాపిక్ గా మారింది.
తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ ‘భారతీయుడు 2’ , ‘భారతీయుడు 3’ సినిమాల నిమిత్తం కమల్ 150 కోట్లు తీసుకున్నారట. ఆయన 200 కోట్లు అడిగారని, కానీ మాట్లాడి ఒక్కో సీక్వెల్ కు 75 కోట్లు చొప్పున అన్నట్లుగా రెండు కలిపి 150 కోట్లు ఇచ్చారట. రెండు సీక్వెల్స్ కు కలిపి 500 కోట్లు బడ్జెట్ పెడుతున్నారని తెలిసింది. ఇందులో శంకర్ రెమ్యునరేషన్ షేర్ కూడా భారీగా ఉందని చెప్తున్నారు. ఇక కమల్ ..కల్కికు 20 కోట్లు, విక్రమ్ కు 50 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అప్పట్లో వచ్చిన భారతీయుడు చిత్రాన్ని దృష్టిలో ఈ సీక్వెల్ సినిమాని మరో స్థాయిలో ఊహించుకుంటూ థియేటర్‌కి వెళ్ళారు ప్రేక్షకులు. అయితే అక్కడక్కడా భారీదనం తప్ప మిగతా ఏ అంశంలోనూ ‘భారతీయుడు’కి దీటుగా లేకపోవడం ప్రేక్షకుల్ని అడుగడుగునా నిరాశపరుస్తుంది. డైరక్టర్ అవినీతిపై చెప్పాల్సింది చాలా వరకు మొదటి భారతీయుడు సినిమాలోనే చెప్పారు. ఇందులో ఇంకా ఏం చెప్పాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే అది చెప్పలేకపోయారు. సగం సగం చూపించి, మిగిలింది మూడో భాగంలో అన్నారు. దాంతో ఓ అసంపూర్ణమైన సినిమా చూసిన అసంతృప్తి కలుగుతుంది. దాంతో డ్రామా రక్తికట్టించదు. ఎమోషన్స్ పండలేదు.