
ఐపీఎల్ ప్రారంభమైన 18 ఏళ్ళ తర్వాత తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ సాధించింది. ఈ విజయం కోసం ఆర్సీబీ ప్రాంఛైజీ, అభిమానులు, ఏళ్లతరబడి నిరీక్షిస్తున్నారు. ఎట్టకేలకు ఆ నిరీక్షణకు ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్ తో తెరపడింది. పంజాబ్ కింగ్స్ జట్టుపై ఆర్సీబీ ఘనవిజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది.
తొలిసారి దక్కిన టైటిల్ కావడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి. కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేయాలని అనుకుంది. దీని కోసం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ పరేడ్ నిర్వహించారు. కానీ ఈ సంబరాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. స్టేడియం బయట అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మంది పైగా గాయాలకు గురయ్యారు. ఈ దుర్ఘటనపై నటుడు కమల్ హాసన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై కమల్ హాసన్ తన అధికారిక "ఎక్స్" (X) ఖాతాలో స్పందించారు. "బెంగళూరులో జరిగిన ఈ విషాదకర సంఘటన గుండెను కలచివేసింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
ఇక మరోవైపు, కమల్ హాసన్ తాజాగా చెన్నైలో తన కొత్త చిత్రం "థగ్ లైఫ్" ప్రమోషన్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఆయన చేసిన "కన్నడ భాష తమిళం నుంచే జన్మించింది" అనే వ్యాఖ్యపై ప్రో-కన్నడ గ్రూపులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన క్షమాపణ కోరకపోతే సినిమా విడుదలను నిలిపివేస్తామంటూ హెచ్చరించారు.
కమల్ హాసన్ మాత్రం తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు. "నాకు ఇలాంటి బెదిరింపులు కొత్తకావు" అని పేర్కొన్నారు. గతంలో కూడా 2013లో ఆయన చిత్రం "విశ్వరూపం" వివాదాల మధ్య తమిళనాడులో రెండు వారాలు నిషేధానికి లోనైందని, ఇతర రాష్ట్రాల్లో విడుదల ఆలస్యమైందని గుర్తు చేశారు.
ఈ వివాదం ప్రభావంతో జూన్ 5న విడుదల కావలసిన "థగ్ లైఫ్" చిత్రం కర్ణాటకలో వాయిదా పడింది. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) ఈ విషయంపై స్పందిస్తూ, కమల్ హాసన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. సమస్యను శాంతియుతంగా పరిష్కరించి సినిమా విడుదలకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఈ నేపథ్యంలో "థగ్ లైఫ్" చిత్రం కర్ణాటకలో విడుదలకు కొంతకాలం బ్రేక్ పడింది. ఇక కమల్ హాసన్ వివరణతో ఈ వివాదం ఎటు తిరుగుతుందో చూడాలి.