
కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. ఆమె ఇటీవల బాలయ్యతో `భగవంత్ కేసరి`లో నటించి అలరించింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీ `సత్యభామ`తో రాబోతుంది. పవర్‌పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాజల్ కనిపించబోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఇది రూపొందుతుంది. ఇందులో నవీన్ చంద్ర కాజల్‌కి పెయిర్‌గా కనిపిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ నెల 7న ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. కాజల్ పోలీస్ ఆఫీసర్‌గా ఎలా సందడి చేయబోతుందో చూడాలి. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శశికిరణ్ తిక్క నిర్మించడం విశేషం.
ఇదిలా ఉంటే కాజల్ మరో విషయంలో డిజప్పాయింట్ చేసింది. ఆమె కమల్ హాసన్‌తో `భారతీయుడు2`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది వచ్చే నెలలో విడుదల కాబోతుంది. ఇలా నెల రోజుల్లోనే బ్యాక్ టూ బ్యాక్ కాజల్ సందడి చేస్తుందని ఫ్యాన్స్ సంతోషించారు. కానీ నిరాశ చెందే వార్త చెప్పారు దర్శకుడు శంకర్. `ఇండియన్ 2`లో కాజల్ కనిపించదని చెప్పాడు. ఆమె మూడో భాగంలో `భారతీయుడు 3`లో ఉంటుందని వెల్లడించాడు. దీంతో కాజల్‌ని బ్యాక్ టూ బ్యాక్ చూడాలనుకున్న ఫ్యాన్స్ కిది నిరాశ చెందే వార్త అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇండియాలోనే ఫస్ట్ టైమ్.. `పేషన్`..
ఫ్యాషన్ డిజైనింగ్‌పై తెలుగులో మొదటిసారి సినిమా వస్తుంది. `పేషన్` పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ చిత్రమిది. సుధీష్ వెంకట్, అంకిత సాహ, శ్రేయాసి షా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. బిఎల్ ఎన్ సినిమా, రెడ్ యాంట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ అరుణ్ కుమార్ మొండితోక, నరసింహ యేలె, ఉమేష్ చిక్కు నిర్మిస్తున్నారు. `పేషన్` చిత్రంతో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఆయన స్టార్ డైరెక్టర్స్ శేఖర్ కమ్ముల, మదన్, మోహన కృష్ణ ఇంద్రగంటి వంటి వారి వద్ద పనిచేశారు. ప్రస్తుతం `పేషన్` మూవీ రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. హైదరాబాద్ లోని కొన్ని పాషన్ కాలేజీలలో 20 రోజుల పాటు తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. రెండో షెడ్యూల్ కు మూవీ టీమ్ రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు అరవింద్ జోషువా మాట్లాడుతూ, హైదరాబాద్ లోని కొన్ని ఫ్యాషన్ కాలేజీలలో 20 రోజులపాటు సినిమాలోని కొన్ని ప్రధాన సన్నివేశాలని చిత్రించాం. ఇప్పుడు రెండవ షెడ్యూల్ కి సిధ్ధమవుతున్నాం. ఫ్యాషన్ ప్రపంచానికి సంబంధించి ఇంతకుముందు ఎపుడూ రానటువంటి ఒక సమగ్రమైన, సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఈ తరహాలో వస్తున్న మొట్టమొదటి భారతీయ సినిమా "పేషన్" అని చెప్పుకోవచ్చు. ప్రేమ, ఆకర్షణకి సంబంధించి యువతలో ఉన్న అనేకమైన ప్రశ్నలకి ఈ సినిమా సమాధానం అవుతుంది` అని తెలిపారు.