“అమ్మ” అస్తమయం

Published : Dec 05, 2016, 07:14 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
“అమ్మ” అస్తమయం

సారాంశం

తమిళనాడు సీఎం జయలలిత అస్తమయం రాత్రి 11.30కు మృతి చెందినట్లు ప్రకటించిన అపోలో అమ్మ మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన తమిళ ప్రజలు

తమిళనాడు ముఖ్యమంత్రి, పురుచ్చి తలైవి.. తమిళ ప్రజల ఆరాధ్య దైవం, అందరిచేత అమ్మా అని పిలిపించుకునే అమ్మ జయలలిత ఇకలేరు. అవును.. ఈ సెప్టెంబర్ 22 నుంచి అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రికి చేరిన తమిళనాడు సీఎం కుమారి జయలలిత గత రెండు నెలలుగా చికిత్స పొందుతూ ఉన్నారు. రేపో మాపో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారనుకుంటున్న తరుణంలో.. నాల్గవ తేదీన అకస్మాత్తుగా జయలలితకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో హుటాహుటిన సాధారణ వార్డు నుంచి ఐసీయూకు తరలించారు. గుండెపోటుకు గురైన జయలలితకు లండన్ వైద్యుడు రిచర్డ్ సహా ఎయిమ్స్, అపోలో వైద్యులు అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం అందించినా ఫలితం దక్కలేదు. చివరకు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఈ మేరకు తమను కూడా జయలలిత మృతి కలచి వేసిందని ప్రకటిస్తూ అపోలో ఆసుపత్రి వైద్యులు.. చివరకు అమ్మ ఇక లేరు అనే చేదు వాస్తవాన్ని వెల్లడించారు.

జయలలిత పార్థివ దేహాన్ని ఆమె నివాసం పోయిస్ గార్డెన్ కు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచుతారని సమాచారం. ఇప్పటికే ఏఐఏడీఎంకే పార్టీ అధికారిక ఎకౌంట్లోనూ అమ్మ ఇక లేరు అని ప్రకటించారు.

ఐదు దఫాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత తమిళ ప్రజల గుండెల్లో తెరగని ముద్ర వేసారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల అభ్యున్నతికి కృషి చేసిన తల్లిగా ప్రతి ఇంటా, ప్రతీ గుండెలో అమ్మ ప్రతిమ గూడు కట్టుకుంది.  దేశం ఒక గొప్ప నేతను కోల్పోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరంలేదు. జయలలిత మృతి కేవలం తమిళనాడుకే కాక యావత్ భారతదేశానికి, రాజకీయాలకు తీరని లోటు అని చెప్పాలి.

ఇక తమిళనాడు రాజకీయాలు రానున్న రోజుల్లో ఎటు వైపు మళ్లుతాయనేది మాత్రం ప్రస్థుతానికి చెప్పలేని పరిస్థితి. పన్నీర్ సెల్వంను సీఎంగా రాజకీయం నడిపించి గత ఎన్నికల్లో గెలుపొందిన అమ్మ ఇక లేకపోవడంతో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఎలాంటి టర్న్ తీసుకుంటారో చెప్పలేని పరిస్థితి. ఆమె మృతిని ప్రకటించటానికి కూడా ఎవరూ స్పందించలేని పరిస్థితి. వెర్రిగా అమ్మను ప్రేమించే తమిళనాడు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారోననేది ఊహించొచ్చు. అందుకే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమ్మ అంత్యక్రియలు పూర్తయ్యేవరకు పక్కా భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించిన సర్కారు... కేంద్రం నుంచి  కూడా బలగాలను మోహరించింది.

ఏదేమైనా అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.

PREV
click me!

Recommended Stories

ఆ కండిషన్ కి ఒప్పుకుంటే నటించు, లేకుంటే వెళ్ళిపో.. శ్రీదేవికి చుక్కలు చూపించిన సూపర్ స్టార్ కృష్ణ
Illu Illalu Pillalu Today Episode Dec 25: రామరాజు కుటుంబంలో పెద్ద కుంపటి, అమూల్య లవ్ మ్యాటర్ రివీల్