
నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన `జాతిరత్నాలు` సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. మూడేళ్ల క్రితం కరోనా సమయంలో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో అద్భుతంగా యాక్ట్ చేశారు. నవ్వులు పూయించారు. దీంతో ఈ సినిమా థియేటర్ లో ఆడియెన్స్ చేత పగలబడి నవ్వేలా చేసింది. కామెడీ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
ఇక చిత్ర దర్శకుడు అనుదీప్ డైరెక్షన్ సినిమాకి పెద్ద హైలైట్. రియల్ లైఫ్‌లో తనలో ఉన్న ఫన్, కామెడీ టైమింగ్‌కి `జాతిరత్నాలు` సినిమా అద్దం పడుతుందని అంటుంటారు. ఇంతటి మ్యాజికల్ హిట్‌గా నిలిచిన ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయితే ఎలా ఉంటుంది, రచ్చ రచ్చే అని చెప్పొచ్చు. త్వరలో `జాతిరత్నాలు` కాంబినేషన్ రిలీప్ కాబోతుందట. అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి ఓ సినిమా చేస్తున్నారు.
దీనికి సంబంధించిన ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయని సమాచారం. అన్ని కుదిరితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టలెక్కబోతుందట. అయితే ఇది `జాతిరత్నాలు` చిత్రానికి సీక్వెల్ కాదని, కొత్త కథతో వస్తున్నట్టు టాక్. కాకపోతే అనుదీప్, నవీన్ పొలిశెట్టి ల్లో ఉండే ఫన్, ఎంటర్ టైన్‌మెంట్ ప్రధానంగానే సినిమా ఉండబోతుందట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే నవీన్ పొలిశెట్టి ఇటీవల అనుష్కతో కలిసి `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` చిత్రంలో నటించారు. మహేష్‌బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కానీ రాంగ్ టైమ్‌లో రిలీజ్ కావడం ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపించింది. లేదంటే ఈ చిత్రం మరో పది ఇరవై కోట్లు అదనంగా వసూలు చేసేది. ఇప్పటికే ఇది ముప్పు కోట్లు దాటి నలభై కోట్ల దిశగా వెళ్తుందట.
దీంతోపాటు నవీన్ పొలిశెట్టి `అనగనగా ఒక రాజు` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో శ్రీలీల కథానాయిక. అయితే ఈ చిత్రం ఆగిపోయిందట. స్క్రిప్ట్ అనుకున్నట్టుగా రాలేదని, దీంతో ఈ ప్రాజెక్ట్ ని నవీన్ పొలిశెట్టి పక్కన పెట్టాడని సమాచారం. ఆ చిత్ర దర్శకుడే `మ్యాడ్` మూవీని తెరకెక్కిస్తున్నారట.