ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున సోదరి, సినీ నిర్మాత నాగ సుశీలపై పోలీసు కేసు నమోదైంది.
ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున సోదరి, సినీ నిర్మాత నాగ సుశీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నాగ సుశీల, మరో 12 మంది తనపై దాడి చేశారని చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, నాగ సుశీల, శ్రీనివాస్‌ల మధ్య కొంతకాలంగా భూవివాదం సాగుతుంది. వీరు గతంలో వ్యాపార భాగస్వామ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ శ్రీజ ప్రకృతి దర్శపీఠం నిర్వాహకుడిగా ఉండగా.. ఈ నెల 12న నాగసుశీల, ఆమె అనుచరులు దాడికి పాల్పడినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఇక,
గతంలో కూడా నాగ సుశీల, శ్రీనివాస్‌ల మధ్య ఆస్తుల వివాదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే.
ఇక, శ్రీనాగ్ ప్రొడక్షన్స్, శ్రీనాగ్ కార్పొరేషన్ అనే పేరుతో మేనేజింగ్ పార్టనర్‌గా చింతలపూడి శ్రీనివాస్, పార్టనర్‌గా నాగ సుశీల కలసి కొన్నేళ్ల పాటు సినిమాలు నిర్మించడంతోపాటు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు. నాగ సుశీల కుమారుడు సుశాంత్ హీరోగా కాళిదాసు, కరెంట్, అడ్డా వంటి చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఆ తర్వాత సుశీల, శ్రీనివాస్‌ల మధ్య ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే 2017లో తన అనుమతి లేకుండానే భూములు అమ్మాడని ఆరోపిస్తూ తన వ్యాపార భాగస్వామి చింతలపూడి శ్రీనివాస్‌పై నాగ సుశీల పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తనను లాకప్‌లో పెట్టి తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకునేందుకే తనపై నాగ సుశీల కేసు పెట్టారని శ్రీనివాస్ అప్పట్లో ఆరోపించారు.