
సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా రోజుల తర్వాత తానేంటో చూపించాడు. `జైలర్` చిత్రంతో తన రేంజ్ ఏంటో బాక్సాఫీసుకి చూపించాడు. తాను కొడితే ఏ రేంజ్‌లో ఉంటుందో చాటి చెప్పాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన `జైలర్` చిత్రం ఇప్పటికే ఐదు వందల కోట్లు దాటి, ఆరు వందల కోట్ల దిశగా పరుగెడుతుంది. ఆ సినిమా కలెక్షన్లని అడ్డుకునే సినిమా ఇంకా రాలేదు. దీంతో కలెక్షన్ల మోత మోగిస్తుంది.
ఈ నేపథ్యంలో నిర్మాత కళానిధి మారన్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సక్సెస్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు. టీమ్‌కి గిఫ్ట్ లిస్తూ సర్‌ప్రైజ్ చేస్తున్నారు. దర్శకుడు నెల్సన్‌కి రోల్స్ రాయ్స్ కారుని గిఫ్ట్ గా ఇచ్చినట్టు సమాచారం. ఇక తన హీరో రజనీకాంత్‌కి మాత్రం సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లిస్తున్నారు. ఇప్పటికే సినిమా పారితోషికం రూ.110కోట్లు ఇచ్చారు. సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ కావడంతో మరో వంద కోట్లు రజనీకి కానుకగా ఇచ్చారు.
లాభాల్లో వందకోట్లని రజనీకాంత్‌కి పారితోషికంగా ఇవ్వడం విశేషం. తన సంతోషాన్ని ఆయన ఇలా పంచుకున్నారు. దీంతో రజనీకి ఈ సినిమాకిగానూ ఏకంగా రూ.210కోట్లు ముట్టినట్టయ్యింది. ఈ లెక్కన ఇప్పుడు అత్యధిక పారితోషికం అందుకున్న స్టార్‌గా నిలిచారు. అంతటితో వదల్లేదు, సూపర్ స్టార్‌కి నచ్చి కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. రెండు బీఎండబ్ల్యూ కార్లని రజనీకాంత్ ఇంటికి తీసుకొచ్చిన నిర్మాత కళానిధి మారన్.. అందులో ఏది నచ్చిందో సెలక్ట్ చేసుకోమని ఆఫర్ ఇచ్చారు. దీంతో తనకు కంఫర్ట్ గా ఉండే బీఎండబ్ల్యూ ఎక్స్ 7 కారుని రజనీ తీసుకున్నారు. దీని విలువ కోటిన్నరగా ఉండటం విశేషం.
రజనీకాంత్ హీరోగా నటించిన `జైలర్` చిత్రంలో తమన్నా కథానాయికగా మెరవగా, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో గెస్ట్ రోల్స్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. ఆగస్ట్ 10న ఈ చిత్రం విడుదలైంది. సంచలన విజయం సాధించింది. సుమారు 250-300కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఐదు వందల కోట్లు రాబట్టింది. డిజిటల్, శాటిలైట్ ఇలా అన్ని చూసుకుంటే సినిమాకిగానూ నిర్మాతకి డబుల్ ప్రాఫిట్‌ని తీసుకొచ్చింది. దీంతో నిర్మాత `జైలర్` సక్సెస్‌ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.