Mimicry Murthy Death : జబర్దస్త్ కమెడియన్ మూర్తి కన్నుమూత.. ఆ వ్యాధితోనే మృతి!

By team teluguFirst Published Sep 27, 2022, 6:31 PM IST
Highlights

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాద ఘటన జరిగింది. జబర్దస్త్ కమెడియన్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన  మూర్తి (Mimicry Murthy) ఈ రోజు  కన్నుమూశారు. ఆయన మరణవార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
 

మిమిక్రీ ఆర్టిస్ట్ గా మూర్తి వందల స్టేజ్ షోలు ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ (Jabardasth)తోనూ బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. మిమిక్రీ కళతో వేలాది ప్రేక్షకులకు దగ్గరైన మిమిక్రీ మూర్తి ఈరోజు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా మూర్తి పాంక్రియాస్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ వ్యాధితోనే ఆర్థిక ఇబ్బందుల్లోనూ కూరుకుపోయారు. కానీ స్నేహితులు, బంధుమిత్రుల సహకారంతో మళ్లీ సాధారణ స్థితికి వచ్చారు. 

అయితే క్యాన్సర్ వ్యాధి నిర్మూలనకు మూర్తి కొన్నేండ్లు చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో కేవలం చికిత్స కోసమే మూర్తి  రూ.16 లక్షలు పెట్టారని తెలుస్తోంది. ఎంత ఖర్చుపెట్టినా ఆయన వ్యాధి నుంచి కోలుకోలేకపోయారు. దీంతో వ్యాధి తీవ్రతతో ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తోంది. మూర్తి జన్మస్థలం హన్మకొండలోనే కన్నుమూశారు. అంత్యక్రియలను కూడా కుటుంబీకులు అక్కడే చేయనున్నారు. అయితే తాజాగా సమాచారం ప్రకారం.. క్యాన్సర్ తగ్గించేందుకు వాడిన మెడిసినన్ తోనే సైడ్ ఎఫెక్ట్స్ ఎటాక్ అయ్యి మరణించినట్టు తెలుస్తోంది. 

మూర్తి మరణ వార్తను ఆయన సోదరుడు అరుణ్ ఈరోజు ధ్రువీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే జబర్దస్త్ మాజీ కమెడియన్ అప్పారావు కూడా వెల్లడించారు. మూర్తికి కొన్నెళ్ల కిందనే పాంక్రియాస్ క్యాన్సర్ ఎటాక్ అయ్యిందని తెలిపారు. వ్యాధి నుంచి బయటపడేందుకు ఎన్నో విఫలయత్నాలు చేశారన్నారు. మూర్తి మరణం తమను బాధిస్తుందని తెలిపారు. అలాగే మూర్తి మరణ వార్త విన్న తోటీ ఆర్టిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఇటీవలనే యంగ్ రెబల్ స్టార్ క్రిష్ణం రాజు మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుంచి బయట పడుతున్న సినీ లోకాన్ని మూర్తి మరణవార్త ఆందోళనకర వాతావరణంలోకి నెట్టింది.

click me!