
ఆహా ఎంటర్టైన్మెంట్ యాప్ లో బాలయ్య తో టాక్ షో అనగానే చాలామంది పెదవి విరిచారు. వేదికలపైనే సరిగా మాట్లాడం రాని బాలయ్య టాక్ షో హోస్ట్ ఏంటి అంటూ ఎగతాళి చేశారు. హోస్ట్ అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. లౌకికంగా మాట్లాడాలి. ముక్కోపి బాలయ్యకు ఇదెలా సాధ్యం అంటూ అంచనాలు వేశారు. ఆ అనుమానాలకు, హేళనలకు బాలయ్య గట్టి సమాధానం చెప్పాడు. అన్ స్టాపబుల్ (Unstoppable) షో నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయ్యింది. వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది.
అన్ స్టాపబుల్ షో అన్ బిలీవబుల్ సక్సెస్ కొట్టింది. హోస్ట్ గా బాలకృష్ణ (Balakrishna)కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఈ షోలో ప్రశ్నలు కూడా సక్సెస్ కి ఒక కారణం. ఎటువంటి ఫిల్టర్లు లేకుండా లోతులు వెళ్లి వ్యక్తిగత విషయాలు కూడా తెరపైకి తేవడం జరిగింది. మోహన్ బాబు, మహేష్, రవితేజ వంటి స్టార్స్ తో బాలయ్య ఎపిసోడ్స్ నభూతో నభవిష్యతి అన్నట్లు ఉన్నాయి. బాలయ్యలో తెలియని కోణాలు ఈ షో ద్వారా బయటపడ్డాయి.
ఈ నేపథ్యంలో అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. అన్ స్టాపబుల్ సీజన్ 2 త్వరలో అంటూ మేకర్స్ ప్రకటించేశారు. వి ఆర్ బ్యాక్ అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్, ఆడియన్స్ పండగ చేస్తుకుంటున్నారు. అన్ స్టాపబుల్ 2 షూటింగ్ కి సంబంధించిన ఏర్పాటు జరుగుతున్నట్లు తెలుస్తుంది.
మరోవైపు బాలయ్య దర్శకుడు గోపీచంద్ మలినేని చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. షూటింగ్ నిరవధికంగా జరుపుతుండగా దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతుంది. అనంతరం దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రంలో బాలకృష్ణ నటిస్తారు. అనిల్ రావిపూడి-బాలకృష్ణ మూవీపై అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.