
ఆదిపురుష్ ప్రకటన ఇండియా వైడ్ సంచలనం రేపింది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ ఎపిక్ రామాయణం చేయడం సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంచనాలు తారా స్థాయికి చేరాయి. భారతీయ సినిమా గర్వించే స్థాయిలో ఉంటుందని భావించారు. టీజర్ విడుదలతో ఆశలన్నీ ఆవిరయ్యాయి. అక్కడ నుండి ఆదిపురుష్ క్రేజ్ పడిపోతూ వచ్చింది. తీరా థియేటర్లో సినిమా చూసి నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి. ఈ తరం రామాయణం అంటూ స్వరూపమే మార్చేశారు. సీన్స్, గెటప్స్ చివరికి కథ కూడా మారిపోయింది.
సాంప్రదాయ వాదులు జీర్ణించుకోలేకపోయారు. విమర్శలు గుప్పించారు. సెంటిమెంట్స్ పక్కన పెడితే, దారుణమైన విజువల్స్, నాసిరకం గ్రాఫిక్స్ ఇబ్బంది పెట్టాయి. కేవలం ప్రభాస్ క్రేజ్, హిందుత్వ సెంటిమెంట్ చిత్రానికి కొంత మేర వసూళ్లు తెచ్చిపెట్టాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా... ఓపెనింగ్స్ దక్కాయి. మొదటి మూడు రోజులు సినిమా సత్తా చాటింది. నాలుగో రోజు నుండే చతికల పడింది.
10వ రోజుకు ఆదిపురుష్ మూవీ 450 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. డొమెస్టిక్ గా కనీసం 300 కోట్లు రాలేదు. రెండో వారమే థియేటర్స్ ఖాళీ అయ్యాయి. మూడో వారం ఛాన్స్ లేదు. చాలా థియేటర్స్ నుండి ఆదిపురుష్ ఎత్తేస్తున్నారు. దీంతో ఆదిపురుష్ బాక్సాఫీస్ రన్ ముగిసినట్లే. రూ. 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ కనీసం రూ. 500 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ప్రభాస్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరింది. ఓం రౌత్ మొత్తంగా ముంచేశాడు.