తమిళ నటుడు శరత్ కుమార్ మెడకు భారీ కేసు

First Published Apr 12, 2017, 2:49 PM IST
Highlights
  • తమిళ నటుడు శరత్ కుమార్ మెడకు భారీ కేసు

తమిళనాడులోని ఆర్కే నగర్ నియోజకవర్గ ఉపఎన్నికలు నటుడు శరత్ కుమార్ కు తలనొప్పి తెచ్చిపెట్టాయి. ఎన్నికల్లో విచ్చలవిడిగా నగదు పంపిణీ చేసేందుకు శరత్ కుమార్ రాధిక దంపతులు అధికార పార్టీకి సహకరించినట్లు తేలడంతో శరత్ కుమార్ పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే శరత్ కుమార్ ఇంటిపై ఐటీ దాడులు చేసిన ఐటీ శాఖ నగదుకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది.

 

గతంలో తమిళనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రముఖ నటుడు శరత్ కుమార్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆయన కారు నుంచి కొద్ది రోజుల క్రితం తొమ్మిది లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన విదితమే. ఆ కేసు ప్రభావం శరత్ కుమార్ పై బలంగానే పడేట్టుంది. తాజాగా ఆర్కేనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఓటర్లకు రూ. 89 కోట్ల మేరకు డబ్బులు పంపిణీ చేసి నట్టు ఆధారాలు లభించాయి.

 

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌, సమత్తువ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు, నటుడు శరతకుమార్‌, అన్నాడీఎంకే మాజీ ఎంపీ చీట్లపాక్కం రాజేంద్రన వద్ద ఆదాయపు పన్నులశాఖ అధికారులు సోమవారం తీవ్ర విచారణ జరిపారు. నుంగంబాక్కంలోని ఆయకార్‌ భవనలో ఐటీ అధికారులు మంత్రి విజయభాస్కర్‌ ను సుమారు నాలుగు గంటలపాటు విచారించారు.

 

ఐటీ కార్యాలయానికి 11 గంటల ప్రాంతంలో మంత్రి చేరుకోగా, అరగంట అనంతరం నటుడు శరతకుమార్‌, ఆ తర్వాత రాజేంద్రన వరుసగా వచ్చారు. మంత్రి విజయభాస్కర్‌ నివాసగృహంలో ఐటీ అధికారులు తనిఖీల్లో చిక్కిన ఆ నగదు కేటాయింపు పత్రాల ఆధారంగానే ఆర్కేనగర్‌ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది.

 

ఈ నేపథ్యంలో ఈనెల 7న మంత్రి విజయభాస్కర్‌, నటుడు శరతకుమార్‌, మాజీ ఎంపీ చీట్లపాక్కం రాజేంద్రనకు చెందిన నివాసగృహాలు, సంస్థల్లో జరిపిన ఆకస్మిక దాడుల్లో పట్టుబడిన దస్తావేజులు, నగదుకు సంబంధించి విచారణ జరిపేందుకుగాను ఆ ముగ్గురికి ఆదాయపు పన్నుల శాఖ అధికారులు విచారణకు హాజరుకమ్మని సమన్లు పంపారు.

 

ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరింపజేశారు. అదేవిధంగా మంత్రి అనుయాయులు కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు శక్తికి మించిన భారంగా మారింది. కాగా ఐటీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరింపజేయడంతో ఏ క్షణంలోనైనా మంత్రిని అరెస్టు చేసే అవకాశముందంటూ వార్తలు వెలువడ్డాయి.

 

దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెల కొంది. ఒకవైపు పోలీసులు, మరోవైపు మంత్రి అనుచరులు, ఇంకో వైపు మీడియా ప్రతినిధులు బారులు తీరడంతో నుంగంబాక్కం ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ స్తంభిం చింది. అయితే సాయంత్రం 4 గంటల వరకూ మంత్రి ని విచారించిన ఐటీ అధికారులు పంపేశారు. మంత్రి మరిన్ని వివరాలు అందించేందుకు మూడు రోజుల పాటు సమయం కోరినట్లు సమాచారం. ఇక నటుడు శరతకుమార్‌, చీట్లపాక్కం రాజేంద్రన వద్ద వేర్వేరుగా విచారణ జరిపారు. 

 

గతంలో నడిగర్‌ సంఘంలో రూ.1.65 కోట్ల మేరకు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఆ సంఘం మాజీ అధ్యక్షుడు, నటుడు శరతకుమార్‌, మరో నటుడు రాధారవిపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ ఆ సంఘం అధ్యక్షుడు నాజర్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక పక్క ఆ ఆరోపణ పై విచారణ మొదలవగా... ఇప్పుడు అంతకంటే పెద్ద కేసే మెడకు చుట్టుకుంది. శరత్ కుమార్ టైమ్ బ్యాడ్.

click me!