హీరో మహేష్ బాబు సినిమా కోసం అనుకుంటున్న విడుదల తేదీ భోళా శంకర్ టీమ్ ప్రకటించారట. ఈ క్రమంలో మహేష్ బాబు అసహనంగా ఉన్నారన్న మాట వినిపిస్తోంది .
సినిమా మంచిగా తీస్తే సరిపోదు. దాన్ని సరైన సమయంలో విడుదల చేయాలి. ఓ సినిమా ఫలితాన్ని రిలీజ్ డేట్ ప్రభావితం చేస్తుందనేది ఒప్పుకోవాల్సిన నిజం. అన్ని విధాలా అనుకూలమైన సమయంలో విడుదల చేస్తే సినిమా కొంచెం అటూ ఇటూ ఉన్నా కొట్టుకుపోతుంది. సంక్రాంతి స్లాట్ కోసం టాలీవుడ్ మొత్తం కొట్టుకునేది ఈ రీజన్ తోనే. సంక్రాంతి పండుగ సినిమాలకు కాసులు కురిపించే సీజన్. ఏమాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా రికార్డు వసూళ్లు దక్కుతాయి. మిక్స్డ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ తో బయటపడతామనే భరోసా ఉంటుంది.
వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల ఫలితాలు దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఊరమాస్ అవుట్ డేటెడ్ కంటెంట్ తో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు మిక్స్డ్ టాక్ వచ్చింది. క్రిటిక్స్ రెండు చిత్రాలకు యావరేజ్ రేటింగ్ ఇచ్చారు. వసూళ్లు మాత్రం దుమ్మదులిపాయి. కేవలం సీజన్ అనుకూలించి ఆ సినిమాలు విజయాలు సాధించాయి.
కాగా భోళా శంకర్ మూవీకి కూడా చిరంజీవి అలాంటి గోల్డెన్ డేట్ పట్టేశారు. ఆగష్టు 11న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భోళా శంకర్ కి వరుస సెలవులు కలిసి రానున్నాయి. 12 రెండో శనివారం కాగా, 13 ఆదివారం, 15 ఇండిపెండెన్స్ డే. మధ్యలో 14 వర్కింగ్ డే అయినప్పటికీ అది లెక్కలోకి రాదు. జనాలు హాలీడే మూడ్లోనే ఉంటారు. ఇది భోళా శంకర్ కి బాగా కలిసొచ్చే అంశం.
అయితే ఈ డేట్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి అనుకుంటున్నారట. ఆగస్టులో విడుదల చేసేందుకు SSMB 28 చిత్రీకరణ నిరవధికంగా జరుపుతున్నారు. ఆగస్టు 11న విడుదల చేయాలనేది నాగ వంశీ ఆలోచనని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సడన్ గా చిరంజీవి ఆ డేట్ లాక్ చేశారు. దీంతో మహేష్ అండ్ టీమ్ గుర్రుగా ఉన్నారట. ఈ క్రమంలో అదే తేదీన మన సినిమా కూడా విడుదల చేయాలా? లేదా మరో తేదీన విడుదల చేద్దామా? అని మీమాంసలో పడ్డారట. టాలీవుడ్ లో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా ఉంది.