
రాజకీయాల్లో ప్రతి పక్షం, పాలక పక్షం ఉన్నట్లుగానే సినిమాల్లోనూ హిట్ అయ్యిన వాళ్లు, వాళ్లని ద్వేషించే వాళ్లు ఉంటారు. అయితే రాజకీయాల్లో వాళ్లెవరు అనేది బహిరంగంగానే తెలిసిపోతుంది. కానీ సినిమాల్లో మాత్రం పూల దండలు వేస్తూ, కంగ్రాట్స్ చేస్తూ వెనకే..వెక్కి వెక్కి ఏడుపులు మొదలెట్టేస్తారు. ఈ కల్చర్ ఇప్పటిది కాదు. ఓ పరిశ్రమకే పరిమితం కాదు. అన్ని భాషల్లోనూ, అన్ని చోట్లా ఉన్నదే. ఇప్పుడు దసరా మూవీకి అదే జరుగుతోంది.
రిలీజ్ రోజు మార్నింగ్ షో నుంచే దసరా మూవీ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మొదటి రోజు నుండి 'దసరా' మూవీ మంచి టాక్ తో దూసుకుపోవటం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే వారు బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కటం లేదు. ఈవినింగ్ మందు పార్టీలలో సినిమాని పొగుడుతూనే..ఏముంది సినిమాలో అంటూ వెటకారాలు చేస్తున్నారు. సినిమా లో కథే లేదని కొందరు, సెకండాఫ్ డల్ అయ్యిందని మరికొందరు చెప్పుకుని సంబరపడుతున్నారు. అయితే భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అందుకోవడం మాత్రం ఎవరికీ సౌండ్ ఉండటం లేదు. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ లో దసరా మూవీ మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఏపీలో కలెక్షన్లు బాగోవు అనుకుంటే అక్కడా తగ్గేదేలే అన్నట్లు ఉన్నాయి. ఓవరాల్ గా నాని కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా దసరా నిలుస్తోంది.
ఈ క్రమంలో ఇవాళ అంటే సోమవారం నుండి దసరా మూవీకి అసలు పరీక్ష మొదలైంది. ప్రతీ సినిమాకు ఇది కామనే. అయితే బ్లాక్ బస్టర్ మూవీస్ కు సోమవారం కలెక్షన్లు పెద్దగా డ్రాప్ అవ్వవు. వీకెండ్ లో వెళ్లని వాళ్లు మెల్లిగా సోమవారం బయిలుదేరతారు. కానీ దసరా విషయానికి వస్తే మండే రోజు అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదించినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. దాంతో ఓ వర్గం ఆ విషయాన్ని ఒకరి నుంచి మరకొరకు షేర్ చేసుకుంటూ ఆనందం పొందుతున్నారు. సాయింత్రాలు పెద్ద పార్టీ పెట్టుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. అయితే అవన్నీ గుట్టుగానే సాగుతాయి. నానీ ని పొగుడుతూ వెనక నుంచి ఏడిచే బ్యాచ్ అంతా ఒకటవ్వనున్నదన్నమాట. అయితే ఇవేమీ మీడియాలోనూ రావు.
ఇక దసరా కలెక్షన్ల పరంగా భయపడాల్సిందేం లేకపోయినా మండే డ్రాప్ ఎక్కువగా ఉంటే మాత్రం టోటల్ కలెక్షన్స్ ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్ లో టికెట్ల ధరలు భారీగా పెంచేయడంతో కలెక్షన్లలో భారీ ఫిగర్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. దాంతో ఈ టికెట్ల రేట్లను పెంచటమే ఆలోచన ఇప్పుడు చాలా మంది డిస్ట్రిబ్యూటర్లకు ఆనందం కలిగిస్తోంది. ఏది ఏమైనా ఇక ఇవాళ్టి నుండి పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. దీని వల్ల కూడా కొంత కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది. నెక్ట్స్ శుక్రవారం రవితేజ రావణాసుర కిరణ్ అబ్బవరం మీటర్ రిలీజ్ కానున్నాయి. ఇవి పాజిటివ్ టాక్ అందుకుంటే దసరాకు కలెక్షన్లు తగ్గే అవకాశాలున్నాయి.