
రాజమౌళి తెరకెక్కించిన అద్భుత కళాఖండం బాహుబలి సినిమా ప్రమోషన్ లో భాగంగా కర్ణాటకలో కన్నడిగులను ఉద్దేశించి కన్నడ భాషలో రాజమౌళి సరళంగా మాట్లాడినప్పుడు అంతా ఆశ్చర్య పోయారు. అయితే రాజమౌళి గురించి తెలిసిన కొంత మంది మాత్రం అస్సలు ఆశ్చర్యపోలేదు..ఎందుకంటే రాజమౌళికి కర్ణాటకతో ఉన్న అనుబంధంమేంటో వారికి తెలుసు. రాజమౌళి రూట్స్ కర్ణాటకతో బలంగా ఉన్నాయని, అసలు రాజమౌళి పుట్టిందే కర్ణాటకలో అని వారికి తెలుసు. రాజమౌళి తెలుగు వాడే అయినా అసలు మూలాలు మాత్రం కర్ణాటకలో ఉన్నాయి.
కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కూడా తాము కన్నడిగులుగా గుర్తింపు పొందటం సంతోషాన్ని, గర్వాన్ని ఇస్తుందని అంటున్నారు. క్రితం ఏడాది కర్ణాటక సర్కారు రాజమౌళిని పద్మశ్రీ అవార్డ కూడూ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి కర్ణాటకలోని రాయచూర్ లో జన్మించాడని పేర్కొంటూ ఈ అవార్డు ప్రకటించారు.
గతంలో రాజమౌళి ట్వీట్ చేసిన ఓ ట్వీట్ కూడా.... “నేను కర్ణాటకలోని రాయచూర్ లో పుట్టాను. పశ్చిమ గోదావరిలో చదువుకున్నాను. చెన్నైలో పని చేశాను. హైదరాబాద్ లో సెటిలయ్యాను. నాది ఏ ఊరో మీరే నిర్ణయించుకోండి”.. అని ఉంది.
విజయేంద్ర ప్రసాద్ యుక్త వయసులో వ్యవసాయం చేస్తుండేవారు. డబ్బు సంపాదించి మంచి రైతుగా సెటిలవ్వాలనే కోరికతో 1968లో.. తమ సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు నుంచి కర్ణాటకలోని రాయచూర్ వెళ్లారు. తన పెద్దన్న కెవి శివశంకర్ తో కలిసి విజయేంద్ర ప్రసాద్ కర్ణాటకలోని రాయచూర్ జిల్లా మాన్వి తాలూక్ హిరేకొటికల్ గ్రామంలో ఏడెకరాల భూమి కొన్నారు. అక్కడే హిరెకొటికల్ లోనే రాజమౌళి 1973లో జన్మించాడు. రాజమౌళి సహోదరిడు కాంచి కూడా అక్కడే జన్నించారు.
“ కన్నడ భాష, అక్కడి సంస్కృతితో మమమేకమైనవారిగా గుర్తింపు పొందడం గర్వంగా అనిపిస్తుంది. మా అబ్బాయి కన్నడిగుడిగానే పద్మశ్రీ అవార్డు పొందాడు.“ అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. అది కూడా కేవలం కన్నడ భాషలో మాత్రమే మాట్లాడుతూ చెప్పారు విజయేంద్ర ప్రసాద్.
ఆ తర్వాత కుటుంబి తిరిగి 1977లో కొవ్వూరుకు వెళ్లింది. అక్కడే రాజమౌళి స్కూల్ విద్యాభ్యాసం పూర్తిచేసుకుని, ఇంటర్ మీడియట్ లో చదువుకు గుడ్ బై చెప్పి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు.
ఇక విజయేంద్ర ప్రసాద్ కుటుంబం కన్నడ కనెక్షన్ ఇంతటితో ముగియలేదు. విజయేంద్ర ప్రసాద్ కన్నడ నటుడు అప్పాజీ నటించిన విష్ణు వర్దన్, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన కురుబన రాణి సినిమాలకు కథను అందించారు. అంతేకాదు.. దేశ మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ నటించిన జాగువార్ సినిమాకు కూడా కథను అందించారు. ఇక వీరి కుటుంబ సభ్యుడు కీరవాణి ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించాడు.
ఇక వచ్చే నెలలో కన్నడలో రిలీజ్ కానున్న శ్రీవళ్లి సినిమాకు విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం కూడా వహించారు. “ఎవరికి తెలుసు, రాజమౌళి ఒకవేళ తన మూలాలున్న చోటికి చేరి కన్నడ సినిమాకు దర్శకత్వం వహిస్తాడేమో” అంటూ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సంభాషించారు.
కట్టప్ప మూలంగా కన్నడిగులను ప్రసన్నం చేసుకోవడానికి రాజమౌళి తన కన్నడ భాషా ప్రావీణ్యాన్ని వాడుకోక తప్పలేదు. ఎందుకంటే ఎప్పుడో కావేరీ జలాలపై తొమ్మిదిన్నరేళ్ల క్రితం సత్యరాజ్ చేసిన కమెంట్స్ కన్నడిగులను ఆగ్రహానికి గురిచేసాయి. సినిమా రిలీజ్ కు ముందు రేగిన ఈ వివాదం రాజమౌళి కన్నడలో చేసిన విజ్ఞప్తితో సద్దుమణిగింది. అలా కన్నడిగుల మనసులు గెలుచుకున్నారు రాజమౌళి.
ఇక బాహుబలి సినిమా చూసేందుకు సీఎంలు కూడా సమయం కేటాయించి మరీ చూస్తున్నారంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు.