
కొన్ని రోజుల క్రితం ఇలియానా తాను రెండో బిడ్డకు జన్మనివ్వడం గురించి హింట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ గుడ్ న్యూస్ ని అఫీషియల్ గా ప్రకటించింది. తనకు రెండో కొడుకు జన్మించిన విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. కుమారుడికి కియాను రఫే డోలన్ అనే పేరు పెట్టినట్లు ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన కుమారుడి ఫోటోను షేర్ చేస్తూ "మా గుండెలు ఆనందంతో నిండిపోయాయి" అంటూ క్యాప్షన్ జత చేశారు. ఇలియానా తన రెండో బిడ్డ ఫోటో షేర్ చేయడం తో క్షణాల్లో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. అభిమానులు హార్ట్ ఎమోజీలు, ప్రేమతో కూడిన కామెంట్లతో ఇలియానాకి శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇలియానా 2023లో తన మొదటి కుమారుడు కోవా ఫొనిక్స్ డోలన్ కి జన్మనిచ్చారు. ఆమె తన భర్త మైఖేల్ డోలన్‌తో కలిసి ప్రస్తుతం ఇద్దరు కుమారులకు తల్లిదండ్రులుగా మారారు. ఈ సందర్భంగా ఇలియానాకి సెలెబ్రిటీల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా కూడా ఇలియానాకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలియానా, ప్రియాంక చోప్రా కలసి 2012లో బర్ఫీ అనే చిత్రంలో నటించారు.
గత ఏడాది ఇలియానా తన రెండో ప్రెగ్నన్సీ వార్తని ప్రకటించింది. ఇప్పుడు పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆమె కుటుంబం సంబరాలు చేసుకుంటోంది. ఇలియానా తెలుగులో దేవదాసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. అయితే ఇలియానా కెరీర్ ని పోకిరి చిత్రం మలుపు తిప్పింది. పోకిరి ఇండస్ట్రీ హిట్ కావడంతో ఆమె టాలీవుడ్ లో అగ్ర నటిగా ఎదిగారు. టాలీవుడ్ లో ఆమె మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రవితేజ, ప్రభాస్ లాంటి అగ్ర హీరోలతో సినిమాలు చేసింది.
ఇలియానా పర్సనల్ లైఫ్ లో కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంది. గతంలో ఆమె ఓ ఆస్ట్రేలియా ఫోటో గ్రాఫర్ ని ప్రేమించింది. అప్పట్లో ఆమె ప్రెగ్నన్సీ గురించి రూమర్స్ కూడా వచ్చాయి. ఆ ప్రేమ విఫలం కావడంతో డిప్రెషన్ కి గురైనట్లు ఇలియానా పలు ఇంటర్వ్యూలలో తెలిపింది.