
హైపర్ ఆది.. పవన్ కళ్యాణ్‌కి అభిమాని. ఆయనకు ఇప్పుడు బ్యాక్ సపోర్ట్ గా నిలబడ్డాడు. మొన్న ఎన్నికల్లోనూ ప్రచారం నిర్వహించాడు. ఎన్నికలు అయిపోయేంత వరకు జనసేన తరఫున ప్రచారం చేసి పవన్ గెలుపుకోసం పాటుపడ్డాడు. ఇప్పుడు మళ్లీ తన షోస్‌తో బిజీ అయ్యాడు. అలాగే వరుస సినిమాలతోనూ మెప్పించేందుకు వస్తున్నారు. తాజాగా ఆయన `శివం భజే` సినిమా ట్రైలర్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.
ఇందులో మీడియాతో ముచ్చటిస్తూ పవన్ కళ్యాణ్, బన్నీ వివాదంపై స్పందించారు. అల్లు అర్జున్ అంటే తనకు ఇష్టమని, ఆయన జాతీయ అవార్డు సాధించిన నటుడు అని చెబుతూ, పవన్ కళ్యాణ్‌కిగానీ, అల్లు అర్జున్‌కి గానీ అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. వాళ్లంతా ఎప్పుడూ ఒక్కటే. నేషనల్ అవార్డు సాధించిన అల్లు అర్జున్‌ని కొందరు ట్రోల్ చేయడం, నెగటివ్ థంబ్ నెయిల్స్ పెట్టడంగానీ ఇకనైనా ఆపేయండి అంటూ ట్రోలర్స్ కి వార్నింగ్ ఇచ్చాడు హైపర్ ఆది.
ఇక కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించానని, ఆయన గెలిచారు, ఇప్పుడు రూల్ చేస్తున్నారు అన్నాడు. ఎమ్మెల్సీ పదవి తీసుకోవడంపై స్పందిస్తూ, అలాంటిదేమీ లేదని, పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టం అంటే ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడటం, బాధలో ఉన్నప్పుడు దగ్గరి నుంచి చూడటం ఇష్టం` అని తెలిపారు. అంతకు మించి ఏమీ ఆశించడం లేదని వెల్లడించారు హైపర్ ఆది.
అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలో గ్యాప్ ఏర్పడిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ తన మామయ్య పవన్‌కి ప్రచారం చేయకుండా ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ నాయకుడు శిల్పా రవిచంద్రరెడ్డికి ప్రచారం చేయడం పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గెలవాలని కేవలం ట్వీట్ చేసిన బన్నీ.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం మాత్రం స్వయంగా వెళ్లి ప్రచారం చేశారు. ఇదే అప్పుడు పెద్ద రచ్చ అయ్యింది. మెగా ఫ్యాన్స్ దీనికి బాగా హర్ట్ అయ్యారు. బన్నీపై ట్రోల్ చేశారు. ఆ ట్రోలింగ్ ఇంకా నడుస్తూనే ఉంది.
అయితే ఇది కేవలం ఫ్యాన్స్ మధ్యనే కాదు, మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య వివాదంగానూ మారిందట. రెండు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందట. బన్నీ చర్యపై మెగా ఫ్యామిలీ గుర్రూగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల నిర్మాత బన్నీవాసు కూడా ఈ విషయంపై ఆచితూచి స్పందించారు. త్వరలోనే అన్నీ సెట్ అవుతాయని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పుడు హైపర్ ఆది.. వాళ్ల మధ్య అలాంటివి లేవని, వాటిని పట్టించుకోరని చెప్పడం విశేషం. మరి ఈ వివాదం ఎప్పుడు సర్దుమనుగుతుందో చూడాలి.