
హీరోయిన్ కావడం ఒక స్టార్ గా ఎదగడం చిన్న విషయం కాదు. దానికి పెట్టిపుట్టి ఉండాలి. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో లక్ ఫ్యాక్టర్ బాగా పని చేస్తుంది. ఒకటి రెండు హిట్ చిత్రాలతో ఓవర్ నైట్ స్టార్స్ అయ్యే అమ్మాయిలు అరుదుగా ఉంటారు. కొందరేమో ఏళ్ల తరబడి తపస్సు చేసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోతారు. అలాంటి హీరోయిన్స్ లో నభా నటేష్ ఒకరు. 2015లో కన్నడ చిత్రం వజ్రకాయ తో వెండితెరకు పరిచయమైన నభా నటేష్ తెలుగులో ఎక్కువ చిత్రాలు చేశారు.
దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి నన్ను దోచుకుందువటే అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తో టాలీవుడ్ కి తీసుకొచ్చారు. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం పర్వాలేదు అనిపించుకుంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ నభా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. చెప్పాలంటే అదే చివరి హిట్ కూడాను. ఇస్మార్ట్ శంకర్ అనంతరం మళ్ళీ హిట్ ఆమె తలుపు తట్టలేదు. అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటర్, డిస్కో రాజా వరుసగా పరాజయం పొందాయి.
నభా చివరి చిత్రం మ్యాస్ట్రో. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ రీమేక్ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేరుగా విడుదల చేశారు. కాబట్టి ఆ చిత్ర ఫలితం ఏదైనా నభాకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. రెండేళ్లుగా ఆమె ఒక్క కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు. దానికి తోడు ఆమెకు చిన్న ప్రమాదానికి గురయ్యారట. షోల్డర్ బోన్ ఫ్రాక్చర్ కావడంతో సర్జరీ చేశారట. ఆ సమయంలో శారీరకంగా మానసికంగా వేదనకు గురైనట్లు నభా నటేష్ వెల్లడించారు.
చేతిలో సినిమాలు లేకపోతే ఆదాయం ఉండదు. దీంతో ప్రమోషన్స్ మీదే నభా నటేష్ దృష్టి పెట్టారు. పలు రకాల యాప్స్, ప్రొడక్ట్స్ ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రోమోట్ చేస్తున్నారు. ప్రమోషనల్ వీడియోలు చేస్తూ ఎంతోకొంత రాబడుతున్నారు. స్టార్ హీరోయిన్ కావాల్సిన నభా టైం కలిసిరాక ఇలా వెయ్యి రెండు వేలకు చిన్న చిన్న ప్రొడక్ట్స్ కి ప్రచారం కల్పిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే నా కెరీర్ ఏమీ ముగియలేదు. కొన్ని స్క్రిప్ట్స్ విన్నాను, సైన్ చేశాను, త్వరలో ప్రకటిస్తానని చెప్పుకొస్తున్నారు.