
హార్ట్ ఆఫ్ స్టోన్ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది అలియా భట్. వండర్ ఉమెన్ ఫేమ్ గాల్ గాడోట్ ఈ చిత్రంలో లీడ్ రోల్ చేశారు. ఓ కీలక పాత్రలో అలియా భట్ నటించారు. జామీ డోర్నన్ సైతం హార్ట్ ఆఫ్ స్టోన్ మూవీలో నటించారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 11 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. హార్ట్ ఆఫ్ స్టోన్ ప్రమోషన్స్ లో గాల్ గాడోట్, అలియా భట్, జామీ డోర్నన్ పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అలియా భట్ గాల్ గాడోట్ కి తెలుగు నేర్పే ప్రయత్నం చేశారు. 'అందరికీ నమస్కారం. మీకు నా ముద్దులు' అని చెప్పాలని గాల్ గాడోట్ ని కోరారు. అందరికీ నమస్కారం అని గాల్ గాడోట్ బాగానే చెప్పారు. కష్టమైనా ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. తెలుగు భాష, తెలుగు సినిమా ఎంతగా ఇతర పరిశ్రమల నటులను ప్రభావితం చేస్తున్నాయో చెప్పేందుకు ఇది నిదర్శనం.
నిజానికి అలియాకు కూడా అంతగా తెలుగు రాదు. ఆమె ఈ రెండు పదాలు నేర్చుకుని గాల్ గాడోట్ తో పలికించే ప్రయత్నం చేసింది. హార్ట్ ఆఫ్ స్టోన్ ప్రమోషన్స్ కి ఈ పరిణామం బాగా ఉపయోగపడింది. హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రాన్ని దర్శకుడు టామ్ హార్పర్ తెరకెక్కించాడు. ఇది ఓ ఏజెంట్ కథ. ఏజెంట్ రేచెల్ స్టోన్ గా గాల్ గాడోట్ నటించారు. తాను కోల్పోయిన దాన్ని తిరిగి పొందేందుకు రేచెల్ స్టోన్ చేసిన సాహసాల సమాహారం.
అలియా భట్ కీలక రోల్ చేయగా ఆమె హాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. ఆమె సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలియా లేటెస్ట్ మూవీ రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీతో అలియా తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.