
విశ్వక్‌సేన్.. మాస్ కా దాస్ అంటూ టాలీవుడ్‌లోకి దూసుకొచ్చాడీ కుర్ర హీరో. హీరోగా నటించిన తొలి చిత్రం `ఫలక్‌నూమా దాస్` తోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన నటించిన `అశోకవనంలో అర్జున కళ్యాణం` చిత్రం ఈ నెల 6న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో వరుసగా చిత్ర ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు.
అందులో భాగంగా కొన్ని ప్రాంక్ వీడియో చేశారు. నిన్న చేసిన ఓ ప్రాంక్ వీడియో దుమారం రేపుతుంది. ఐమాక్స్ వద్ద అన్ని సినిమాలకు తనదైన స్టయిల్‌లో రివ్యూలు చేసే ఓ అభిమానితో కలిసి ప్రాంక్ చేశాడు విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ కారు ముందు పడి తాను పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా ఈ ప్రాంక్ వీడియో ఉంది. ఇది వైరల్ అయ్యింది. దీన్ని కొందరు తప్పుపడుతున్నారు. ఏకంగా విశ్వక్‌సేన్‌పై ఫిర్యాదు నమోదు కావడం విశేషం.
తన సినిమా ప్రచారం కోసం ప్రాంక్ వీడియోల పేరుతో న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ నటుడు విశ్వక్‌సేన్‌పై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ హెచ్‌ఆర్‌సీకి ఇచ్చిన పిటిషన్‌లో పేర్కొన్నట్టు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్లు చేయనివ్వకుండా చూడాలని హెచ్.ఆర్.సి.ని కోరినట్టు ఆయన చెప్పారు. తాజాగా దీనిపై హీరో విశ్వక్ సేన్ స్పందించారు. తన సినిమాని బతికించడం కోసం ఏమైనా చేస్తానని తెలిపారు.
ఆయన మాట్లాడుతూ, నేను నటించిన నాలుగో చిత్రమిది. నా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఏమైనా చేస్తా. సినిమాను బతికించుకోవలసిన బాధ్యత నాపై ఉంది. ప్రమోషన్ కోసం రెండు నిమిషాల ప్రాంక్ వీడియో చేశా. అందులో పెట్రోల్‌కు బదులు నీళ్లు వాడాం. ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి పిటీషన్‌లో పెట్రోల్ అని పేర్కొన్నారు. దానిని సాకుగా తీసుకుని బతుకుతెరువు కోసం ప్రాంక్ వీడియోలు చేసే అందరి మీద కేస్ వేస్తానని అనడం న్యాయం కాదు. వాళ్లు చాలా చిన్న మనుషులు. వారిని బతకనిద్దాం.
నేను ఎన్నో కష్టాలు చూసి ఇక్కడి వరకూ వచ్చా. నాకు ఏదైనా సమస్య వచ్చినా నేను తట్టుకోగలను. కానీ వారు తట్టుకోలేరు. నా వల్ల వాళ్లకు ఇబ్బంది కలిగితే నాకు గిల్టీగా ఉంటుంది` అని అన్నారు. ఇదిలా ఉంటే సోమవారం దీనిపై టీవీ9 స్టూడియో వివరణ కోరగా అందులో యాంకర్‌పై దురుసుగా వ్యవహరించి, బూతులు తిట్టారు. దీనికి యాంకర్ సైతం ఫైర్ అయ్యింది. ఇది కూడా మరింత పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఇలా వరుస వివాదాలు విశ్వక్ సేన్‌ని వెంటాడుతున్నాయి. మరి ఇవి తన సినిమాకి ప్లస్ అవుతాయా? మైనస్ అవుతాయో చూడాలి. ఇక ఈ చిత్రంలో రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటించింది. బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించారు.