
విశాల్ లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని. ఈ చిత్రం సెప్టెంబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. టైం ట్రావెల్ నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా మార్క్ ఆంటోని తెరకెక్కింది. ప్రధాన పాత్రలు ఫోన్ లో టైం ట్రావెల్ చేయడం, ఆ పాత్రల మధ్య సంఘర్షణే మార్క్ ఆంటోని మూవీ అని తెలుస్తుంది. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న విశాల్ అవార్డ్స్ ని ఉద్దేశిస్తూ ఒకింత వివాదాస్పద కామెంట్స్ చేశారు.
ఇటీవల భారత ప్రభుత్వం జాతీయ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై మీ స్పందన ఏంటని అడగ్గా... నాకు అసలు అవార్డులపై నమ్మకం లేదు. ఒకవేళ నాకు అవార్డు వస్తే దాన్ని చెత్త బుట్టలో పడేస్తా. ఈ అవార్డుల కంటే ప్రేక్షకుల ప్రశంసలు, అభిమానమే మిన్నగా భావిస్తాను. అభిమానుల ప్రోత్సాహంతో రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్నాను. ఈ స్థాయికి ఎదిగాను... అని ఆయన అన్నారు.
అలాగే రాజకీయ ప్రవేశం మీద కూడా ఆయన స్పందించారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఒకప్పుడు నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న రాధారవి నన్ను ఆహ్వానించి సభ్యునిగా చేరమని బ్రతిమిలాడారు. తర్వాత ఆయన మీదే పోటీ చేసి నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా గెలిచాను. కాబట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందనేది మనం చెప్పలేం అన్నారు.
ఇక మార్క్ ఆంటోని మూవీకి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఎస్ జె సూర్య, సునీల్, సెల్వరాఘవన్, రీతూ వర్మ కీలక రోల్స్ లో నటించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. విశాల్ కి సాలిడ్ కమర్షియల్ హిట్ పడి చాలా కాలం అవుతుంది. మార్క్ ఆంటోని తో ఆయన కమ్ బ్యాక్ అవుతారనిపిస్తుంది.