
కరోనా వైరస్ క్రమంగా మళ్లీ పెరుగుతుంది. వరుసగా సినిమా సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్ భామ కరీనా కపూర్, మరోవైపు యాక్షన్ కింగ్ అర్జున్ కరోనాకి గురయ్యారు. ప్రస్తుతం వాళ్లు హోం ఐసోలేషన్‌లో ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఇటీవల కోలీవుడ్‌లో కమల్ హాసన్ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో సెలబ్రిటీకి కరోనా సోకింది. ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచే చియాన్ విక్రమ్ కరోనా బారిన పడ్డారు. ఆయన అనారోగ్యానికి గురైన నేపథ్యంలో కరోనా టెస్ట్ చేయించుకోగా, గురువారం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్టు విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణ వెల్లడించారు.
ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. `విక్రమ్ కి కొద్దిపాటి లక్షణాలున్నాయి. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ప్రార్థనలకు ధన్యవాదాలు` అని తెలిపారు. విక్రమ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం విక్రమ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతున్నారు.
ఇటీవలే విక్రమ్ .. పా రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఆయనకు 61వ సినిమా. దీన్ని స్టూడియో గ్రీన్‌పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విక్రమ్ `మహాన్` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆయన కుమారుడు ధృవ విక్రమ్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై తెరకెక్కుతుంది. అలాగే మణిరత్నం రూపొందిస్తున్న `పొన్నియిన్‌సెల్వన్`లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు విక్రమ్. మరోవైపు `కోబ్రా` చిత్రంలో నటిస్తున్నారు.