
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ లాంచ్ ప్రారంభమైంది. ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 7 లో రూల్స్ మొత్తం మారిపోనున్నాయి. దీనితో ఈ సీజన్ ఎలా ఉండబోతోందో అని ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున ఉల్టా పుల్టా అంటూ ఆసక్తి పెంచేస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 7 హౌస్ లోకి రెండవ కంటెస్టెంట్ గా హీరో శివాజీ ఎంట్రీ ఇచ్చారు. హీరో శివాజీ నాగార్జున తో తన లైఫ్ జర్నీ గురించి చెప్తుంటే కన్నీళ్లు పెట్టించేంత ఎమోషనల్ గా ఉంది. శివాజీ ఆకలి కడుపుతో తన ప్రయాణం మొదలు పెట్టాడట. హైదరాబాద్ లో అడుగుపెట్టి సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ఒక్కో మెట్టు ఎదుగుతూ టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.
నాగార్జునతో శివాజీ ఎవ్వరికి తెలియని విషయాన్ని పంచుకున్నాడు. శివాజీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక ఫస్ట్ రెమ్యూనరేషన్ చెక్ ఇచ్చింది నాగార్జునే అట. సీతారాముల కళ్యాణం చూతము రారండి చిత్రంలో శివాజీ నటించారు. వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రాన్ని నాగార్జున నిర్మించారు.
నీ లైఫ్ లో ఉల్టా పుల్టా మూమెంట్ ఏంటి అని అడగగా.. నా లైఫ్ నాకు తెలియదు అని శివాజీ అన్నారు. హైదరాబాద్ కి బతకడానికి వచ్చా. ఇలా మీముందు ఉన్నా అని అన్నాడు. నాగార్జున మాట్లాడుతూ బయట పాలిటిక్స్ చూసావ్.. ఇక్కడ హౌస్ లో చాలా పాలిటిక్స్ ఉంటాయి. ఏం చేస్తావ్ అని ప్రశ్నించాడు.. ఏముంది సర్ నోరేసుకుని పడిపోతా అని శివాజీ షాకిచ్చాడు. మాకు కావలసింది కూడా అదే అని నాగార్జున అన్నారు.
వెంటనే శివాజీ తన బాల్యంలో వాళ్ళ అమ్మతో ఉన్న ఫోటోని నాగ్ చూపించారు. దీనితో శివాజీ వెంటనే కంటతడి పెట్టుకున్నారు. అమ్మంటేనే మ్యాజిక్ అని శివాజీ అన్నాడు. అమ్మ పేరు చెబితే నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది అని తన పేదరికం గురించి తెలిపాడు. అమ్మ మా ఊళ్ళో చిన్నప్పుడు కోడి పిల్లలని పెంచుతూ వాటిని అమ్మి మా కోసం పండక్కి బట్టలు కొనేది అని శివాజీ చెబుతున్న విషయాలు అందరిని ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నాయి. తాను హైదరాబాద్ వచ్చాక అమ్మకోసం గోల్డ్ చైన్ కొన్న సందర్భం నా లైఫ్ లో మెమొరబుల్ ఇన్సిడెంట్ అని తెలిపాడు.