
శివ కార్తికేయన్-అనుదీప్ కేవీ కాంబోలో తెరకెక్కిన ప్రిన్స్ అంచనాలు అందుకోలేకపోయింది. హీరో, దర్శకుడు ఫార్మ్ లో ఉండగా మూవీపై హైప్ ఏర్పడింది. జాతిరత్నాలు చిత్రంతో అద్భుతం చేసిన అనుదీప్ మరోసారి మ్యాజిక్ చేస్తాడని అందరూ భావించారు. ప్రిన్స్ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అనుదీప్ రూపొందించారు. కామెడీ పర్లేదు అనిపించినా ఎమోషన్ లేని రొమాన్స్ జనాలకు కనెక్ట్ కాలేదు. దీంతో చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ప్రిన్స్ పెద్ద మొత్తంలో బిజినెస్ చేసింది. ఈ క్రమంలో బయ్యర్లు నష్టపోయారు.
కాగా నష్టపోయిన నిర్మాతలు, బయ్యర్లను ఆదుకునేందుకు తన రెమ్యునరేషన్ నుండి కొంత మొత్తాన్ని ఆయన తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. దాదాపు రూ. 6 కోట్ల రూపాయలు శివ కార్తికేయన్ వెనక్కి ఇచ్చేశారట. శివకార్తికేయన్ నిర్ణయం కొంతలో కొంత నిర్మాతల నష్టాలు తగ్గించినట్లు తెలుస్తుంది. శివ కార్తికేయన్ గత రెండు చిత్రాలు డాక్టర్, డాన్ మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా డాక్టర్ వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఈ నేపథ్యంలో శివ కార్తికేయన్ సినిమాకు రూ. 30 నుండి 35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఎలాంటి సపోర్ట్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరోల్లో శివ కార్తికేయన్ ఒకరు. బుల్లితెరపై ఆయన కెరీర్ మొదలైంది. శివ కార్తికేయన్ మిమిక్రీ ఆర్టిస్ట్, స్టాండప్ కమెడియన్ గా ప్రస్థానం మొదలుపెట్టాడు. ప్రస్తుతం కోలీవుడ్ టాప్ స్టార్స్ లిస్ట్ లో చోటు సంపాదించారు. ఆయన నటించిన రెమో, డాక్టర్ తెలుగులో కూడా విజయం సాధించాయి. శివ కార్తికేయన్ హీరోగా మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.