
డ్రగ్స్ స్కాండల్ లో వెలుగుచూసిన టాలీవుడ్ సెలెబ్రిటీలను ఒక్కొక్కరిగా విచారిస్తున్న సిట్ ఆదివారం కావడంటో నిన్న విరామం తీసుకుంది. ఇప్పటికే 19వ తేదీ నుంచి ప్రారంభమైన సిట్ విచారణకు పూరీ జగన్, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్ లు హాజరయ్యారు. ఇక సోమవారం సిట్ విచారణ తిరిగి ప్రారంభమైంది. ఇవాళ ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు హాజరైన హీరో నవదీప్ ను విచారించనున్నారు సిట్ అధికారులు. ఉదయం పదిన్నర గంటల నుంచి ప్రారంభమైన విచారణ సుదీర్ఘంగా సాగే అవకాశముందని తెలుస్తోంది.
ఇక డ్రగ్స్ కేసుకు సంబంధించి సిట్ విచారణలో భాగంగా... సమాధానాలిచ్చిన తరుణ్ డ్రగ్స్ హైదరాబాద్ పబ్బుల్లో కొత్తేమీ కాదనీ, హైదరాబాద్‌లోని 15 పెద్ద పెద్ద పబ్బులల్లో డ్రగ్స్ దందా నడుస్తోందని సిట్ అధికారులకు వెల్లడించినట్టు సమాచారం. అయితే తాను మాత్రం ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, సరఫరా చేయలేదని సిట్ బృందానికి చెప్పాడట తరుణ్. హైదరాబాద్‌లోని పబ్బుల్లో డ్రగ్ కల్చర్ గురించి, వాటికి ఎక్కడి నుంచి డ్రగ్ వస్తుంది? ఎలా డీల్ చేస్తారు? గతంలో తరుణ్ సొంతంగా పబ్ నిర్వహించిన అంశాలపై ఎక్కువగా సిట్ ప్రశ్నలు అడిగిన్నట్టు సమాచారం. తరుణ్ ‘ఆన్’ పబ్ 2010 లోనే అమ్మేసి స్లీపింగ్ పార్ట్నర్ గా కొన్నాళ్ళు కొనసాగి.. తర్వాత మొత్తంగా తప్పుకున్నాడట.
రవితేజ సోదరులు భరత్, రఘు మాదక ద్రవ్యాలను కొనుగోలు చేస్తూ పట్టుబడిన తర్వాత సినిమా పరిశ్రమలో డ్రగ్ అడిక్ట్స్ చాలామంది ఉన్నారని పోలీసులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్న పది ప్రముఖ పబ్స్ లో డ్రగ్స్ వ్యాపారం జోరుగా సాగుతోందని, రెడ్ హ్యాడెండ్ గా పట్టుకుంటామని కూడా అప్పట్లో పోలీసులు కొంత హల్ చల్ చేయటంతోనే తరుణ్ పబ్ వ్యాపారం నుంచి తప్పుకున్నాడని అంటారు. పదే పదే గోవాకు వెళతారని, జీశాన్, కెల్విన్‌లతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపైనా సిట్ బృందం తరుణ్ ను ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో గోవాకు వెళ్లే వారంతా డ్రగ్స్ తీసుకున్నారనుకుంటే ఎలాగని తరుణ్ ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. తన స్నేహితులకు గోవాలో హోటళ్లు, రెస్టారెంట్ వ్యాపారాలు ఉన్నాయని.. వాటిలో తనకూ వాటాలు ఉన్నాయని, అందులో భాగంగానే గోవా వెళుతుంటానని చెప్పినట్లు సమాచారం.
ఇక వైద్య బృందం తరుణ్ రక్త నమూనాలు, గోర్లు, వెంట్రుకలు సేకరించినట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. కాగా ఉదయం 10.15 గంటలకు విచారణ మొదలుకాగా.. రాత్రి 11.40 గంటలకు తరుణ్‌ను బయటికి పంపించారు. అంటే సుమారు పదమూడున్నర గంటల పాటు సిట్ విచారణ సాగింది.
ఇక సిట్ విచారణలో జీషాన్ అలీ.. సినీ ప్రముఖులతో తనకున్న సంబంధాల గురించి వెల్లడించినట్లుగా చెబుతున్నారు. హీరో రవితేజ, నవదీప్ లకు డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా సిట్ ఎదుట జీషాన్ చెప్పినట్లుగా సమాచారం. జీషాన్ అలీ రవితేజకు ఇచ్చేవాడని దీనికి సంబంధించిన ఆధారాల్ని సిట్ సేకరించినట్లుగా తెలుస్తోంది. జీషాన్ అలీ సౌతాఫ్రికా నుంచి డ్రగ్స్ తెచ్చి రవితేజకు ఇచ్చేవాడని.. రవితేజతో పాటు.. నవదీప్ కూ కూడా జీషాన్ అలీ డ్రగ్స్ సరఫరా చేసే వాడని చెబుతున్నారు. డ్రగ్స్ రాకెట్ లో కెల్విన్ తర్వాత కీలక పాత్ర దారి జీషాన్ వద్ద ఇందుకు సంబంధించిన ఆధారాల్ని సిట్ కొంతమేర సేకరించినట్లుగా తెలుస్తోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఈ నెల 25న రవితేజను సిట్ అధికారులు విచారించనున్నారు. డ్రగ్స్ కేసు విచారణలో సోమవారం నవదీప్, మంగళవారం రవితేజ, బుధవారం చార్మి, గురువారం ముమైత్‌ఖాన్ విచారణకు హజరవుతారని సిట్ తెలిపింది.