`నేచురల్‌ స్టార్‌` ట్యాగ్‌ వెనుకున్న సీక్రెట్‌ బయటపెట్టిన నాని.. ఏం చెప్పాడంటే?

By Aithagoni RajuFirst Published Mar 23, 2023, 6:52 PM IST
Highlights

హీరో నాని ఇప్పుడు `దసరా` చిత్రంతో రాబోతున్నారు. తాజాగా ఆయన `నేచురల్‌ స్టార్‌` అనే ట్యాగ్‌పై స్పందించారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై తన రియాక్షన్‌ తెలియజేశారు.

హీరో నానిని.. నేచురల్‌ స్టార్‌గా పిలుచుకుంటారు అభిమానులు. చిత్ర పరిశ్రమ సైతం అలానే పరిగణిస్తుంది. సహజమైన నటనతో మెప్పించే నాని ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చి ఎదిగాడు. హీరో నుంచి ఇప్పుడు స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. `దసరా` తర్వాత పాన్‌ ఇండియా హీరో అయిపోయినా ఆశ్చర్యం లేదు. అయితే తాజాగా నాని తన `నేచురల్‌ స్టార్‌` అనే ట్యాగ్‌పై స్పందించారు. పీటీఐ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అందులో భాగంగా ఆయన `నేచురల్‌ స్టార్‌` అనే ట్యాగ్‌పై రియాక్ట్ అయ్యారు. 

ఇందులో మాట్లాడుతూ, నేచురల్‌ స్టార్‌ అనేది అభిమానుల ముద్దుగా తనని పిలుచుకునే పదం అన్నారు. ఆ పదంలో వారి ప్రేమ ఉందని, తమ ప్రేమని ఆ ట్యాగ్‌ రూపంలో అందిస్తుంటారని వెల్లడించారు. నేచురల్‌ స్టార్‌ అనేది తన పెద్ద యూఎస్‌పీ అన్నారు. అయితే ఆడియెన్స్ నాతో తమని చూసుకుంటారని, తమ ఫ్రెండ్స్ ని చూసుకుంటారని, తమ ఇంట్లో మనిషిగా చూస్తారని తెలిపారు. అదే నాకు పెద్ద ప్లస్‌ అని, అందుకే తనకు నేచురల్‌ స్టార్‌ అనే బిరుదుని ఇచ్చారని వెల్లడించారు. నేచురల్‌స్టార్‌ అనే పదంలో ఆడియెన్స్ కి తనపై ఉన్న ప్రేమ కనిపిస్తుందని, దానికి తాను అలవాటు పడిపోయానని తెలిపారు. 

నిజానికి ఆ పదానికి న్యాయం చేస్తున్నానా, అంతటి సామర్థ్యం తనకు ఉందా అంటూ చెప్పలేను, కానీ ఆ పదంతో ఆడియెన్స్ తనకు దగ్గరవుతున్నారని, మా మధ్య ఆ స్పెషల్ బాండింగ్‌ ఏర్పడుతుందని చెప్పారు నాని. అది కేవలం ట్యాగ్‌ మాత్రమే కాదు, అది అభిమానుల ప్రేమకి నిదర్శన, తనని ఎంతగా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారనేదానికి కొలమానం అని వెల్లడించారు.

`దసరా` సినిమాలో తాను నటించిన ధరణి పాత్ర గురించి చెబుతూ, సందర్భానుసారంగా ఎదిగే వ్యక్తి కథ అని చెప్పారు. `నేను లార్జర్ దెన్‌ లైఫ్‌ పాత్రలను కూడా నమ్ముతాను. అవెంజర్స్ చిత్రాలను ప్రేమిస్తాను. కానీ ఇలాంటి లార్జర్‌ దెన్‌ లైఫ్‌ క్షణాలు సహజంగా జరగాలని కోరుకుంటాను. ఎమోషన్స్ కారణంగా సాధారణ స్థితి నుంచి ఎదిగి, జీవితం కంటే పెద్దగా మారిపోవాలని కోరుకుంటా, `దసరా` సినిమా కూడా అలానే ఉంటుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` విజయం తర్వాత తెలుగు కంటెంట్‌కి పెరుగుతున్న ఆదరణ కారణంగా నా సినిమా ఇతర భాషల ఆడియెన్స్ కి కూడా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నా` అని చెప్పారు నాని. 

ఈ సందర్భంగా హిందీలో సినిమాలు చేయడంపై నాని స్పందిస్తూ, తనకు హిందీలో కూడా ఆఫర్లు వస్తున్నాయని తెలిపారు. అయితే వాటిలో ఏదైనా ఎగ్జైటింగ్‌గా అనిపిస్తే చేస్తానని, ఇక్కడ నటించేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటానని వెల్లడించారు. ఇకపై తన నుంచి అన్ని పాన్‌ ఇండియా సినిమాలు వస్తాయని చెప్పలేమని, అలాంటి కథలు వస్తేనే పాన్‌ ఇండియా చేస్తానని తెలిపారు. 

నాని, కీర్తిసురేష్‌ జంటగా, సముద్రఖని, సాయికుమార్‌, జరీనా వాహబ్‌ కీలక పాత్రలు పోషించిన `దసరా` చిత్రానికి శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గల సింగరేణి బొగ్గుగణులలో ఓ గ్రామంలో జరిగే కథగా ఈ సినిమా తెరకెక్కింది. మార్చి 30న ఈ చిత్రం పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదల కాబోతుంది. 
 

click me!