సిల్క్ స్మిత అంత్యక్రియలకు పరిశ్రమ మొత్తం దూరం... హాజరైన ఏకైక స్టార్ హీరో ఆయనే!

By Sambi Reddy  |  First Published Apr 26, 2023, 8:11 AM IST

సిల్క్ స్మిత మరణం అప్పట్లో ఓ సంచలనం.  సిల్క్ స్మిత భౌతికకాయాన్ని చూసేందుకు ఒక్కరు కూడా రాలేదట. కానీ ఒక్క స్టార్ హీరో వచ్చారట. 


దశాబ్దానికి పైగా సాగిన కెరీర్లో సిల్క్ స్మిత వందల చిత్రాల్లో నటించారు. చిరంజీవి, రజినీకాంత్, మోహన్ లాల్, బాలకృష్ణ... ఇలా టాప్ స్టార్స్ అందరితో జతకట్టారు. కానీ ఆమె అంత్యక్రియలు దారుణంగా జరిగాయి. ఒక అనాధ శవంలా అయిన వారు, పరిశ్రమ ప్రముఖులు ఎవరూ పక్కన లేకుండా సాగనంపారు. ఆమెతో నటించిన హీరోలు కన్నెత్తి చూడలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిగాక సిబ్బంది అంత్యక్రియలు పూర్తి చేశారు. 

అయితే హీరో అర్జున్ మాత్రం ఆ రోజు సిల్క్ స్మిత భౌతికకాయాన్ని చూసేందుకు వెళ్ళాడట. అర్జున్ తో సిల్క్ స్మిత పలు చిత్రాల్లో నటించారు. మంచి స్నేహితులట. తన ఒంటరితనం, చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా... నేను చనిపోయితే కనీసం నువ్వైనా చూడటానికి వస్తావా? అని సిల్క్ స్మిత తరచుగా అర్జున్ ని అడుగుతూ ఉండేవారట. ఖచ్చితంగా అని అర్జున్ హామీ ఇచ్చారట. ఇచ్చిన మాట ప్రకారం ఎవరేమనుకున్నా పర్లేదని అర్జున్ సిల్క్ స్మిత భౌతికకాయాన్ని సందర్శించారట. ఈ విషయాన్ని తాజాగా ఓ జర్నలిస్ట్ బయటపెట్టారు. 

Latest Videos

80లలో శృంగార తారగా వెండితెరను ఏలారు సిల్క్ స్మిత. ఓ పల్లెటూరి అమ్మాయి సౌత్ ఇండియాను షేక్ చేశారు. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి కాగా అత్తింటివారి వేధింపులు తాళలేక చెన్నై పారిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు. తెలిసినవారు లేరు, అక్షరం ముక్కరాదు... కేవలం బ్రతకాలన్న మొండితనం ఆమెను సినిమా వైపు అడుగులు వేసేలా చేసింది. ఒక్కో విషయం తెలుసుకుంటూ, నేర్చుకుంటూ స్టార్ అయ్యారు. ఏళ్ల తరబడి బిజీ యాక్ట్రెస్ గా గడిపారు. ఆకాశంలోకి రివ్వున దూసుకెళ్లిన తారాజువ్వలా వెలుగులు చిమ్మి అంతలోనే కనుమరుగైంది. 

1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత 35 ఏళ్ల ప్రాయంలో కన్నుమూసింది. చెన్నైలో సిల్క్ స్మిత తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. సిల్క్ స్మిత మరణం మీద అనేక పుకార్లు ఉన్నాయి. ప్రాధమికంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా డర్టీ పిక్చర్ పేరుతో బయోపిక్ తెరకెక్కించారు. విద్యాబాలన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 
 

click me!