అనాథాశ్రమంలో లావణ్య త్రిపాఠి సందడి.. 11ఏళ్లుగా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నా అంటూ ఎమోషనల్‌ నోట్‌..

By Aithagoni RajuFirst Published Apr 25, 2023, 8:40 PM IST
Highlights

అమ్మానాన్నలను దూరం చేసుకున్న ఎంతో మంది విద్యార్థులు ఈ గృహంలో చదివి ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడుతున్నారనే విషయం తెలుసుకున్న లావణ్య, ఈ రోజు వారితో సరదాగా గడిపింది.

తెలుగు తెర `అందాల రాక్షసి` లావణ్య త్రిపాఠి తనదైన నటనతో, అందంతో ఆకట్టుకుంది. నటిగా వెండితెరపై మెప్పించడం మాత్రమే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ తనది గొప్ప మనసని చాటుకుంది. తాజాగా ఈ అమ్మడు అనాథాశ్రమాన్ని సందర్శించింది. ఎల్బీనగర్‌లోని `ఆనంద విద్యార్థి గృహాం`లో మంగళవారం సందడి చేసింది. వారితో కాసేపు టైమ్‌ స్పెండ్‌ చేసిన లావణ్య త్రిపాఠి విద్యార్థులతో కలిసి భోజనం చేసింది, పిల్లల ప్రతిభని చూసి ముచ్చటపడింది, నిర్వాహకుల నిర్వహణ చూసి సంతోషించింది.  

విధి రాతలో అమ్మానాన్నలను దూరం చేసుకున్న ఎంతో మంది విద్యార్థులు ఈ గృహంలో చదివి ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడుతున్నారనే విషయం తెలుసుకున్న లావణ్య, ఈ రోజు వారితో సరదాగా గడిపింది. అనాథాశ్రమం వ్యవస్థాపకులు మార్గం రాజేష్‌లను కలిసి ఆశ్రమం వివరాలను తెలుసుకుంది. విద్యార్థుల జీవితాలు తనకు ఎంతో స్ఫూర్తిని కలిగించాయని ఆనందం వ్యక్తం చేసింది. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నా భోజనం ఆరగించింది. అనాథ విద్యార్థి గృహంలో పిల్లలకు కావల్సిన అత్యవసర మందులను కానుకగా అందించి మానవత్వాన్ని చాటుకుంది. 

Latest Videos

ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ.. తమ కుటుంబంలో ఎవరు సినీ పరిశ్రమతో సంబంధం లేకున్నా, 11 ఏళ్లు ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ మంచి నటిగా ఎదిగానని వివరించింది. తనకు అవకాశాలు ఇచ్చిన దర్శకులు, ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ఆశ్రమంలోని తన అనుభావాలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది లావణ్య. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆమె పోస్ట్ చేస్తూ, ఆనంద విద్యార్థి గృహాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉందని, ఈ తెలివైన పిల్లలు చదువుకోవడానికి కావాల్సనవన్నీ పొందుతూ మంచి భవిష్యత్‌ని పొందుతున్నారని తెలిసి నా హృదయం నిండిపోయింది. 

వారు తమ వంటలు వారే చేసుకుంటారు, క్లీనింగ్‌ చేస్తారు, సొంతంగా సెలూన్, కుట్టు మిషన్లు కలిగి ఉన్నారు. నేను చూసిన ఇతర కేంద్రాల కంటే దీన్ని చాలా బాగా చూసుకుంటున్నారు. అది నాకు బాగా నచ్చింది. రాజేష్‌ చాలా ఇన్‌స్పైరింగ్‌ పర్సన్‌. దీనికి నా వంతు సహకారం ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. ఈ ఆశ్రమానికి ఆహ్వానించినందుకు, ఇంత బాగా చూసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా` అని చెప్పింది లావణ్య. అయితే తాను వెళ్లే సమయంలో మీడియాని ఆహ్వానించడం సరికాదు అని ముందుగా అనుకుందట. కానీ అక్కడికి వెళ్లాక ఈ ప్లేస్‌ ని అందరు చూడాలనిపించిందట, ఎవరైనా అవసరంలో ఉన్న వారికి ఇది సహాయం చేస్తుందని పేర్కొంది లావణ్య. ఈ సందర్భంగా ఆశ్రమలో పిల్లలతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. గతేడాది `హ్యాపీ బర్త్ డే` చిత్రంలో నటించిన లావణ్య ఇప్పుడు ఓ తమిళ సినిమా చేస్తుంది. 

click me!